నిఫా... గతేడాది కేరళను వణికించిన మహమ్మారి వైరస్. ఈ వ్యాధి విజృంభణను ఎలా నియంత్రించాలో తెలియక కేరళ ప్రభుత్వం హడలిపోయింది. ఇప్పుడు మళ్లీ నిఫా ముప్పు పొంచి ఉందని తెలిపారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ.
ప్రమాదకర వైరస్ గురించి ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు శైలజ. వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉందన్నారు. ఈటీవీ భారత్ ముఖాముఖిలో ఈ విషయాన్ని వెల్లడించారు కేరళ ఆరోగ్య మంత్రి.
" ఈ సారి ముందు జాగ్రత్త చర్యలతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేరళలోని ప్రభుత్వ ల్యాబ్, పుణెకు చెందిన బయోలాజికల్ ల్యాబ్ మాకు సాయం అందిస్తోంది."
-కేకే శైలజ, కేరళ ఆరోగ్య మంత్రి.
గతేడాది నిఫా విజృంభించినప్పుడు ఔషధాలు అందుబాటులో లేక, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురైనట్లు వివరించారు శైలజ. నిఫా ఏ ప్రాంతంలోనైనా, ఎప్పుడైనా వ్యాప్తి చెందే అవకాశముందన్నారు మంత్రి. అందరూ అప్రమత్తంగా ఉండాలని, గబ్బిలాలు కొరికిన పండ్లను తినొద్దని సూచించారు.
నిఫాతో గతేడాది కేరళ బెంబేలు..
2018లో మృత్యు వైరస్ నిఫా కారణంగా కేరళ హడలిపోయింది. 18 కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జూన్‌లో ఓ 23 ఏళ్ల విద్యార్థికి నిఫా వైరస్ సోకింది. వెంటనే దానిని నియంత్రించగలిగారు. పెను ప్రమాదం తప్పింది.
అందుకే నిఫా అని పేరు...
గబ్బిలాల నుంచి జంతువులు, మనుషులకు వ్యాపిస్తుంది నిఫా. సాధారణంగా ఆ వైరస్.. వరాహాలు, శునకాలు, గుర్రాలకు వ్యాప్తి చెందుతుంది. ఒకవేళ మనుషుల్లోకి ప్రవేశిస్తే అత్యంత ప్రమాదం. ఈ వైరస్ సోకిన వారు తీవ్ర అస్వస్థతకు గురై మరణించే అవకాశాలుంటాయి.
నిఫా వైరస్‌ను 1998-1999 మధ్య కాలంలో మలేసియాలో సుంగై నిఫా గ్రామంలో తొలిసారి గుర్తించారు. ఈ కారణంగానే ఆ వైరస్‌కు నిఫా పేరు వచ్చింది.
ఇదీ చూడండి: అంతర్జాతీయ సమస్యలపై మోదీ, జిన్‌పింగ్ చర్చ