సంస్కరణల పేరిట కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేరళ అసెంబ్లీ ఆమోదించింది. రైతుల సమస్యలను పరిష్కరించి, మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు.
వ్యవసాయ రంగం అనేక సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ చట్టాల వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం దేశానికి ఉత్పాదకత అందించేది మాత్రమే కాదని, దేశ సంస్కృతిలో భాగమని వ్యాఖ్యానించారు. కాబట్టి వ్యవసాయ సంస్కరణలు జాగ్రత్తగా పరిశీలించి అమలు చేయాలని అన్నారు. సంస్కరణల అమలులో కేరళకు విశేష అనుభవం ఉందని తెలిపారు.
రైతుల నిరసనలతో దేశ రాజధాని అట్టుడికిపోతోందని, అత్యంత చలిలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయని సీఎం పేర్కొన్నారు. 35 రోజుల వ్యవధిలో 35 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
సాగు చట్టాలపై చర్చించేందుకే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.