సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ) వ్యతిరేక నిరసనల్లో ఉగ్రదాడి కుట్రకు పాల్పడిన ఆరోపణలతో ఓ కశ్మీర్ మహిళను పోలీసులు ఈ ఏడాది తొలినాళ్లల్లో అదుపులోకి తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కస్టడీలో ఉన్న హీనా బషీర్బేగ్కు కరోనా వైరస్ సోకినట్టు తాజాగా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా దిల్లీలోని లోక్‌నాయక్ జయ్‌ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో ఆమెను చేర్పించాలని ఆదేశించారు న్యాయమూర్తి.
వారికి నెగెటివ్..
ఈ కేసులో హీనా, ఆమె భర్త జహన్‌జైబ్ సమీతో పాటు మరో వ్యక్తి అబ్దుల్ బాసిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి కస్టోడియల్ విచారణ ఆదివారంతో ముగిసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు శనివారం వీరికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. హీనాకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. మిగిలిన ఇద్దరికి వైరస్ సోకలేదు. ఎన్ఐఏ రిమాండ్ కోరని నేపథ్యంలో.. వీరిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది న్యాయస్థానం.
హీనాకు రెండు నెలల మధ్యంతర బెయిల్ ఇప్పించాలని ఆమె తరఫు న్యాయవాది ఎమ్ఎస్ ఖాన్ కోర్టును కోరారు. దిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో.. ఆమెకు సరైన వైద్య సదుపాయాలు అందించలేని స్థితిలో ఆస్పత్రులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు న్యాయవాది.