ఏడు దశాబ్దాల క్రితం బ్రిటిష్ పాలకుల నుంచి స్వేచ్ఛ కోసం పోరాడిన స్వాత్రంత్ర్య సమరయోధుడు.. ఇప్పుడు మరోసారి పోరాటానికి దిగారు. ఈసారి తన సమరం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపైన. ఆయనే కర్ణాటకకు చెందిన హెచ్ ఎస్ దొరెస్వామి. 101 ఏళ్ల వయసులోనూ సామాజిక అంశాలపై చురుగ్గా స్పందిస్తూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు..
కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని ఫ్రీడం పార్క్ వద్ద దొరెస్వామి సత్యాగ్రహం చేపట్టారు. ఆ తర్వాత అధికారుల చర్చలతో జనవరి 5న దీక్ష విరమించారు. కాగా.. సరిగ్గా నెల రోజులకు దొరెస్వామి మళ్లీ పోరు బాటపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు బెంగళూరు టౌన్‌హాల్ వద్ద ఐదు రోజుల ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం నిన్న ఆయన టౌన్‌హాల్ వద్దకు చేరుకున్నారు. అయితే ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ టౌన్‌హాల్ నుంచి వెళ్లేందుకు దొరెస్వామి ఒప్పుకోలేదు. 'మమ్మల్ని ఇక్కడి నుంచి బలవంతంగా పంపిస్తే డీసీపీ ఆఫీస్ వద్దకు వెళ్లి ధర్నా చేస్తాం' అని చెప్పారు.
ఇది మరో స్వాత్రంత్ర్య పోరాటం..
తన జీవితంలో ఎన్నో ఆందోళనల్లో పాల్గొన్న దొరెస్వామి.. తాజా పరిస్థితులను స్వాతంత్య్ర సమరంతో పోల్చారు.
"వాస్తవ సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మోదీ, ఆయన ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, విద్వేష ఘటనలు వంటి సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం తప్ప మరో అవకాశం నాకు కన్పించలేదు. మళ్లీ స్వాత్రంత్ర్య పోరాటం చేస్తున్నట్లుగా ఉంది."
-దొరెస్వామి, ఉద్యమకారుడు
న్యాయం కోసం దేశ యువత ముందుకు రావాలని, కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: 'ఆమ్ఆద్మీ'కి అనైతిక దెబ్బ-సిసోడియా ఓఎస్డీ అరెస్ట్!