కరోనాను దరి చేర్చేవి మన చేతులే. అవి శుభ్రంగా ఉంచుకోకపోతే వైరస్‌ను బొట్టు పెట్టి మరీ ఆహ్వానించినట్టే అవుతుంది. అందుకే శానిటైజర్ల వాడడం తప్పనిసరి అయ్యింది. అయితే కరోనా దెబ్బకి మార్కెట్లో శానిటైజర్ల కొరత ఏర్పడి ధర ఆకాశన్నంటుతోంది. ఇదే అదునుగా కల్తీరాయళ్లు రెచ్చిపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంట్లోనే శానిటైజర్ తయారు చేసుకునే చిట్కాను చెబుతున్నారు మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని జీవాజీ వర్సిటీ వైద్యవిద్యార్థులు.
వందల రూపాయలు వెచ్చించి మార్కెట్లో రసాయన శానిటైజర్లను కొనుగోలు చేసే బదులు.. కేవలం రూ.70 నుంచి రూ.80 పెట్టి ఇంట్లోనే ఆరోగ్యానికి హాని చేయని శానిటైజర్లను తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.
"శానిటైజర్ తయారు చేసేందుకు ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ ఉపయోగిస్తాం. అందులో కలబంద గుజ్జు, రోజ్‌వాటర్, డిస్టిల్డ్ వాటర్, కాస్త గ్లిసరిన్ వేసి బాగా కలిపాం. కలబంద గుజ్జు చేతుల్లోని తేమ పోకుండా చేస్తుంది. ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌లోని లక్షణాలు చేతులను పొడిబారుస్తాయి. కేవలం ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌ను కూడా శానిటైజర్లా వినియోగించవచ్చు. అయితే అలా చేయడం వల్ల కొన్ని దుష్ప్రభావాలకు అవకాశం ఉంది."
-డాక్టర్ వర్ష, శాస్త్రవేత్త
తయారీ ఇలా..
100 మిల్లీలీటర్ల శానిటైజర్ తయారు చేయాలనుకుంటే.. కేవలం 40మిల్లీలీటర్ల ఐసోప్రొఫైల్ ఆల్కహాల్, 10మిల్లీలీటర్ల కలబంద గుజ్జు, 5-10మి.లీల రోజ్‌వాటర్, 40మి.లీ డిస్టిల్డ్ వాటర్(పరిశుభ్రమైన నీరు) తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో మూడు చుక్కల గ్లిసరిన్ను వేయాలి. అంతే... మీ చేతులను పరిరక్షించే శానిటైజర్ తయారైనట్టే.