సెప్టెంబరులో జరగాల్సిన నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి భాజపాయేతర పాలనలోని ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు. పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని గతంలో ఇచ్చిన తీర్పును పునర్సమీక్షించాలని కోరాయి.
ఈ మేరకు ఆరు రాష్ట్రాల మంత్రులు(బంగాల్ నుంచి మొలోయ్ ఘటక్, ఝార్ఖండ్ నుంచి రామేశ్వర్ ఒరాన్, రాజస్థాన్ నుంచి రఘు శర్మ, ఛత్తీస్గఢ్ నుంచి అమర్జీత్ భగత్, పంజాబ్ నుంచి బీఎస్ సిద్దు, మహారాష్ట్ర నుంచి ఉదయ్ రవీంద్ర సావంత్) సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
నీట్, జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని ఆగస్టు 17న తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. కరోనా కారణంగా ఎంతో విలువైన ఏడాది కాలాన్ని విద్యార్థులు కోల్పోవడానికి వీల్లేదని తెలిపింది.
నీట్, జేఈఈ వాయిదా కోసం న్యాయపోరాటం చేసే అంశంపై ఇటీవల భాజపాయేతర పార్టీల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చ జరిగింది.