పూరీ జగన్నాథ రథయాత్ర ఈసారి జనం లేకుండానే ముందుకు సాగింది. పరిమిత సంఖ్యలో హాజరైన భక్తులు, ప్రభుత్వ సిబ్బంది రథాలను శ్రీగుడించా ఆలయం వరకు తీసుకొచ్చారు. రథయాత్ర జరుగుతున్నంత సేపు బాకానాదాలు హోరెత్తాయి. 'తమ ఇష్టదైవమైన జగన్నాథుని రథాన్ని లాగలేకపోయామే' అని పలువురు నిరుత్సాహానికి గురయ్యారు. రథయాత్ర గుడించా ఆలయం వద్దనున్న శరదవల్లికి చేరి విరామం తీసుకుంది. ఈ రాత్రి గుడించా ఆలయంలోకి వెళ్తాయి రథాలు. జగన్నాథుడి అత్తారిల్లుగా భావించే ఈ ఆలయంలో తొమ్మిది రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి పూరీకి చేరుకుంటాయి.
ప్రారంభమైందిలా..
ఉదయం మూడు గంటలకు మంగళహారతితో జగన్నాథ ఉత్సవాన్ని ప్రారంభించారు నిర్వాహకులు. అనంతరం మైలమ, తడప లాగి సేవలు చేశారు. అనంతరం అబకాష, సకల దూప, పహండి, మదన్ మోహన్ బిజె కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటలకు రథప్రతిష్ఠ జరిగింది.
'చేరా పన్హారా'తో షురూ..
ఉదయం 11.30 గంటల సమయంలో 'చేరా పన్హారా' కార్యక్రమ ఉత్సవంతో రథయాత్ర ఘట్టం ప్రారంభమైంది. సిద్ధం చేసిన రథాలపై ఊరేగింపు ప్రారంభమయింది.
ఉరుకులు, పరుగులతో..
శ్రీబలభద్ర, జగన్నాథ, సుభద్రలు కొలువు తీరిన రథాలు నందగోశ్ వైపుగా పరుగులు తీయడం ప్రారంభించాయి. అనంతరం రథాల పోటీ ప్రారంభమయింది. శ్రీబలభద్ర, సుభద్ర కొలువుతీరిన తాలధ్వజ, దేవదాలన రథాలు పరుగులు తీశాయి. జగన్నాథుడు కొలువుతీరిన నందిగోశ రథం.. శ్రీబలభద్ర, సుభద్రల రథాలను దాటేసి ముందుగా లక్ష్యాన్ని చేరుకుంది. అనంతరం రథాలు శరదవల్లికి చేరి ప్రత్యేక పూజలు అందుకుని.. అక్కడ నిలిచిపోయాయి.
పరిమిత సంఖ్యలో..
సుప్రీం తీర్పు నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు హాజరయ్యారు. రథాలను లాగేందుకు 5వందలమందిని మాత్రమే అనుమతించారు.
టీవీలో వీక్షించిన సీఎం
రథయాత్ర ప్రత్యక్షప్రసార దృశ్యాలను వీక్షించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. రథయాత్ర సజావుగా సాగేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరోగ్యమంత్రి నవకిషోర్ దాస్, న్యాయమంత్రి ప్రతాప్ జనా, విద్యామంత్రి సమీర్ రంజన్ దాస్ హాజరయ్యారు.
ప్రధాని శుభాకాంక్షలు..
జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
ఇదీ చూడండి: చైనా మంత్రి ఎదుటే డ్రాగన్‌పై జైశంకర్ పంచ్!