ఇటీవల జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రాజకీయ కుటుంబాలు సత్తా చాటాయి. ప్రముఖ నాయకుల కుటుంబ సభ్యులు, బంధువులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పలుచోట్ల తండ్రీకొడుకులు, భార్యాభర్తల్లో ఒకరు ఎంపీగా ఉంటే మరొకరు ఎమ్మెల్యేగా గెలిచారు.
దేశ్‌ముఖ్ వారసులు
మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అమిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్ ఇద్దరూ లాతూర్ పట్టణం, లాతూర్ గ్రామీణం నుంచి విజయదుందుభి మోగించారు.
పవార్ కుటుంబం
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి నుంచి గెలుపొందారు. ఆయనకు తోడుగా శరద్‌పవార్ మనమడు రోహిత్ పవార్ విధాన భవన్‌కు వెళ్లారు. కర్జాత్ జామ్‌ఖేడ్‌లో మంత్రి రామ్ శిందేను ఓడించారు రోహిత్.
అజిత్ పవార్ భార్య సునేత్ర అల్లుడు రాణా జగ్జీత్ సిన్హా పాటిల్.. భాజపా టికెట్‌తో తుల్జాపుర్ నుంచి గెలుపొందారు.
ఎన్సీపీ బంధుగణాలు
ఎన్సీపీ బంధుగణాల్లో ఒకరైన బాబన్ శిందే మాఢా స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు. ఎన్సీపీ మద్దతుతో ఆయన సోదరుడు సంజయ్ శిందే కర్మాలా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ నాసిక్‌లోని యేవలా స్థానంలో తిరిగి గెలుపొందగా... ఆయన కుమారుడు పంకజ్ మాత్రం నందగావ్‌లో ఓటమి పాలయ్యారు.
ప్రత్యర్థులుగా..
పర్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పంకజ్ ముండేపై ఆయన బంధువు, ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే గెలుపొందారు. నిలంగాలో భాజపా మంత్రి శంభాజీ పాటిల్ నిలాంగేకర్.. ఆయన సమీప బంధువయిన కాంగ్రెస్ నేత అశోక్ పాటిల్ నిలాంగేకర్ను ఓడించారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో బంధువులపైనే విజయం సాధించారు పలు నేతలు.
కొత్త తరం..
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి కొత్త తరం నేతలు ఈ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేశారు. ఎన్సీపీ సునీల్ తత్కరే కుమార్తె ఆదితి.. శ్రీవర్ధన్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ మాజీ నేత, ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ శిందే కుమార్తె ప్రణితి శిందే మధ్య సోలాపుర్ స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు.
తండ్రీ కొడుకులు..
- ఠాణే శివసేన నేత, మంత్రి ఏకనాథ్ శిందే కోపరి పంచ్పఖాడీ స్థానంలో గెలుపొందారు. ఆయన కుమారుడు శ్రీకాంత్... కల్యాణ్ నుంచి ఎంపీగా ఉన్నారు.
- నితేశ్ రాణే(ఎమ్మెల్యే, కుమారుడు)- నారాయణ్ రాణే(ఎంపీ, తండ్రి)
- సంతోష్ ధన్వే (ఎమ్మెల్యే, కుమారుడు)- కేంద్ర మంత్రి రావ్‌సాహెబ్ ధన్వే(ఎంపీ, తండ్రి)
- సుజయ్ వీఖే పాటిల్ (ఎంపీ, కుమారుడు)- రాధాకృష్ణ వీఖే పాటిల్ (ఎమ్మెల్యే, తండ్రి)
భార్యాభర్తలు..
- రవి రాణా(ఎమ్మెల్యే, బద్నేరా) - నవనీత్ రాణా(ఎంపీ, అహ్మద్‌నగర్)
- సురేశ్ ధనోర్కర్ (ఎంపీ)- ప్రతిభ(ఎమ్మెల్యే, వరోడా)