చంద్రయాన్-2 ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం నేడు జరగనుంది. ఇందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. మరికాసేపట్లో చంద్రయాన్-2 జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం చంద్రుడి ధృవాలకు 100 కి.మీల దూరంలోకి వెళ్లడమే లక్ష్యంగా ఆర్బిటర్ ప్రయాణించనుంది.
సెప్టెంబర్ 2న విక్రమ్ లాండర్... ఆర్బిటర్ నుంచి వేరవనుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. జాబిల్లి ఉపరితలంపై లాండర్ సురక్షితంగా దిగే లోపు రెండుసార్లు చంద్రుడి కక్ష్యలో తిరగనుందని స్పష్టం చేశాయి.
చంద్రయాన్-2 ను జులై 22న జీఎస్ఎలస్వీ మార్క్3-ఎం1 వాహకనౌక ద్వారా నింగిలోకి పంపించారు. ఆగస్టు 14న భూకక్ష్య నుంచి వైదొలగి... జాబిల్లి లక్ష్యంగా ప్రయాణించింది. నేడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది.
అంతరిక్ష వాహకనౌక స్థితిని ఎప్పటికప్పుడు ఇస్రోలోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు బెంగళూరులోని ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్ (ఐఎస్టీఆర్ఏసీ), ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) సహకరిస్తున్నాయి. ప్రపంచానికి అవగాహన లేని చంద్రుడిలోని దక్షిణ ధ్రువ ప్రాంతం గురించి చంద్రయాన్-2 పరిశోధన చేయనుందని ఇస్రో వర్గాలు ఇంతకుముందే వెల్లడించాయి.
"చంద్రుడిపై మెరుగైన అధ్యయనం, ఉపరితలం, ఖనిజాల విశ్లేషణ సహా ఇతర పరిశోధనలు చేసేందుకు ఈ ప్రయోగం ఉపకరిస్తుంది."
-ఇస్రో
ఇవీ చూడండి: డ్రగ్స్ వద్దన్నాడని.. తండ్రినే హతమార్చిన తనయ!