భారత్.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జాబిల్లి యాత్ర చంద్రయాన్-2 మరో మైలురాయిని చేరుకుంది. జులై 22న ప్రయోగించిన ఆర్బిటర్ పలు దశలను దాటి మంగళవారం ఉదయం 9.02 నిమిషాలకు చందమామ కక్ష్యలోకి ప్రవేశించింది. సుమారు 28 నిమిషాల పాటు ఈ ప్రక్రియ సాగింది. అనంతరం రెండు సార్లు జాబిల్లిని చుట్టి.. చంద్రుడి ధృవాలకు 100 కిలో మీటర్ల దూరంలోకి వెళ్లనుంది చంద్రయాన్-2.
ఈ పూర్తి వ్యవహారంపై ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటన చేయనున్నారు.
తర్వాతి దశ ఏంటి?
విక్రమ్ లాండర్ సెప్టెంబర్ 7న ఆర్బిటర్ నుంచి వేరై చంద్రునిపై ల్యాండవనుంది. జాబిల్లి ఉపరితలంపై లాండర్ సురక్షితంగా దిగే లోపు రెండుసార్లు చంద్రుడి కక్ష్యలో తిరగనుందని స్పష్టం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు.
చంద్రయాన్-2 ను జులై 22న జీఎస్ఎలస్వీ మార్క్3-ఎం1 వాహకనౌక ద్వారా నింగిలోకి పంపించారు. ఆగస్టు 14న భూకక్ష్య నుంచి వైదొలగి... జాబిల్లి లక్ష్యంగా ప్రయాణించింది. ఈరోజు జాబిల్లి కక్ష్యలోకి చేరింది.
అంతరిక్ష వాహకనౌక స్థితిని ఎప్పటికప్పుడు ఇస్రోలోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు బెంగళూరులోని ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్ (ఐఎస్టీఆర్ఏసీ), ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) సహకరిస్తున్నాయి. ప్రపంచానికి అవగాహన లేని చంద్రుడిలోని దక్షిణ ధ్రువ ప్రాంతం గురించి చంద్రయాన్-2 పరిశోధన చేయనుందని ఇస్రో వర్గాలు ఇంతకుముందే వెల్లడించాయి.
ఇదీ చూడండి:- చందమామతో ఓ మాట చెప్పాలని...