తమిళనాడు అరియలూర్ జిల్లా జయన్కొండంకు చెందిన బాలసుబ్రహ్మణ్యం విశ్రాంత వైద్యాధికారి. జిల్లా ఆస్పత్రిలోనే సేవలందించారు. జయన్కొండం బస్టాప్ దగ్గర తనుకున్న ప్లాట్‌లో ఓ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలనుకున్నారు. లోన్ కోసం గంగాయి కొండ చోలాపురంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లారు. అక్కడ బ్రాంచ్ మేనెేజర్ విశాల్ పటేల్‌ను కలిశారు. ఆదాయ పన్ను రిటర్ను సహా అవసరమైన అన్ని పత్రాలు సమర్పించారు.
అయితే లోన్ విషయంతో సంబంధం లేకుండా 'మీకు హిందీ వచ్చా?' అని సుబ్రహ్మణ్యాన్ని అడిగాడు బ్యాంకు మేనేజర్. అందుకు మాజీ వైద్యుడు తనకు తమిళం, ఆంగ్లం మాత్రమే వచ్చని చెప్పారు. దీంతో ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించాడు మేనేజర్ విశాల్. 'నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను, నాకు హిందీ మాత్రమే వచ్చు. హిందీ వచ్చిన కస్టమర్లకే లోన్ ఇస్తాం' అని సబ్రహ్మణ్యానికి తేల్చి చెప్పాడు. పత్రాలను కూడా సరిగ్గా చూడకుండానే లోన్ ఇవ్వడం కుదరంటూ భాష గురించే పదేపదే ప్రస్తావించాడు.
మేనేజర్ దురుసు ప్రవర్తన పట్ల తీవ్ర అసహనానికి గురయ్యారు మాజీ వైద్యుడు. భాష రాదనే కారణంతో తనకున్న ప్రాథమిక హక్కును హరించారని, అందుకు పరిహారం చెల్లించాలని బ్యాంకుకు నోటీసు పంపారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.
వివాదం పెద్దదవుతుందని భావించిన బ్యాంకు నిర్వాహకులు చర్యలకు ఉపక్రమించారు. మేనేజర్ విశాల్ పటేల్‌ను తిరుచురాపల్లి బ్రాంచ్‌కి బదిలీ చేశారు.
స్టాలిన్ ఆగ్రహం..
బ్యాంకు మేనెేజర్ ప్రవర్తనపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా అహంకారానికి ఈ ఘటన నిదర్శనమని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తమిళుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం అగ్నికి ఆజ్యం పోసినట్లేనని హెచ్చరించారు. తమిళనాడులో విధులు నిర్వహించేందుకు వచ్చిన అధికారి ఇంత దురుసుగా ఉంటారా అని మండిపడ్డారు. భాజపా ప్రభుత్వం ఇలాంటి వారిని వెనుకేసుకొస్తుందా? అని ప్రశ్నించారు.