డ్రోన్ల వినియోగంలో అగ్రస్థానం రక్షణ దళాలదే. ఇటీవలి కాలంలో పౌర వినియోగం సైతం ఊహించని స్థాయిలో పెరిగింది. సర్వే, డాక్యుమెంటరీ, శుభకార్యాల చిత్రీకరణతో పాటు మౌలిక రంగంలో విరివిగా వీటిని ఉపయోగిస్తున్నారు. దేశంలో దాదాపు ఆరు లక్షల రోగ్ (అనుమతి/నియంత్రణలేని) డ్రోన్లు గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా మానవరహిత విమాన వ్యవస్థ విపణి 2021నాటికి 2200 కోట్ల డాలర్లకు, భారత్‌లో 88.6 కోట్ల డాలర్లకు చేరుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అనుమతిలేని డ్రోన్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ, రక్షణ సంస్థలు పకడ్బందీ రాడార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ- అనుమానిత డ్రోన్లను పసిగట్టి నిర్వీర్యపరచడంలో ఆ వ్యవస్థలూ విఫలమవుతుండటం ఆందోళనకర సమస్యగా మారింది.
సౌదీ దాడి.. అమెరికాలో డ్రోన్లతో సమాచార తస్కరణ...
సౌదీఅరేబియాలో చమురు క్షేత్రాలపై దాడి; పంజాబ్‌లో మారణాయుధాల జారవిడత, అమెరికాలో డ్రోన్ల ద్వారా సమాచార తస్కరణపై వ్యక్తమవుతున్న అనుమానాలు ఆయా దేశాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక కంప్యూటర్ అప్లికేషన్ల తోడ్పాటుతో డ్రోన్ల ద్వారా వివిధ దేశాల సమాచారాన్ని చైనా సేకరిస్తుందనే ఆరోపణలున్నాయి. తక్కువ ధరకు లభిస్తుండటంతో ఆ దేశంలో తయారయ్యే డ్రోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న 70 శాతం డ్రోన్లు చైనాలోనే తయారవుతున్నట్లు అంచనా.
భారత్‌లో డ్రోన్‌లను ప్రైవేటు అవసరాలకు పరిమితంగానే ఉపయోగించుకునే వీలుంది. ఇప్పటివరకూ డాక్యుమెంటరీ చిత్రీకరణ, ప్రభుత్వ సర్వేలకు మాత్రమే డ్రోన్లను ఉపయోగించేందుకు అనుమతి ఉంది. పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) నిరుడు డిసెంబరులో ఈ నియంత్రణను సడలించింది. ఇదే సమయంలో వాణిజ్య డ్రోన్ల ద్వారా దృశ్యమాన పరిధికి ఆవల (బీవీఎల్‌ఓఎస్) కూడా సేవలు అందించేందుకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు పూనుకొంది. దీనికోసం ఆసక్తి ఉన్న సంస్థల నుంచి మే నెలలో దరఖాస్తులు స్వీకరించింది. క్రిమిసంహారక మందులను డ్రోన్లతో పైనుంచి పంటలపై చల్లడంవల్ల రైతుల ఆరోగ్యంపై రసాయన ప్రభావం తగ్గుతుంది. వీటిద్వారా అత్యవసర సమయాల్లో ఆరోగ్య కేంద్రాలకు, సరైన రవాణా సదుపాయం లేని ప్రాంతాలకు మందులను, రక్తాన్ని తీసుకెళ్ళడం సులభతరం అవుతుంది.
శస్త్రచికిత్సల సమయంలో అవయవాలను తరలించడానికీ డ్రోన్లను ఉపయోగించే అవకాశాలున్నాయి. దాదాపు 40వేల గ్రామాల సరిహద్దులు, కాలువలు, రహదారులను డ్రోన్ల సాయంతో గుర్తించేందుకు ‘సర్వే ఆఫ్ ఇండియా’తో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది.
డ్రోన్ పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. డ్రోన్ కార్పొరేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది. ‘డ్రోన్ సిటీ ఆఫ్ తెలంగాణ’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ‘బీవీఎల్‌ఓఎస్’ ప్రయోగాల కోసం పౌర విమానయాన శాఖకు ఈ ఏడాది జులైలో ప్రతిపాదనలు పంపించింది. దేశంలో దాదాపు 50 అంకుర సంస్థలు డ్రోన్లకు సంబంధించి కొత్త ఆవిష్కరణలలో నిమగ్నమయ్యాయి. డ్రోన్లకు ఉన్న డిమాండును దృష్టిలో ఉంచుకొని పౌర విమానయాన శాఖ ‘డిజిటల్ స్కై’ వేదికను రూపొందించింది.లక్షల సంఖ్యలో ఉన్న డ్రోన్లను నియంత్రించే పనిలో భాగంగా వాటి వినియోగానికి అనుమతులను తప్పనిసరి చేసింది. పౌర వినియోగం కోసం ఉపయోగించే డ్రోన్లు ఈ వేదికనుంచి అనుమతి పొందాల్సి ఉన్నప్పటికీ, అతితక్కువ సంఖ్యలో నిబంధనలకు కట్టుబడుతున్నట్లు సమాచారం. 250 గ్రాముల కన్నా తక్కువ బరువును మోయగల డ్రోన్లు 50 అడుగుల ఎత్తువరకు ఎగరడానికి ఎలాంటి అనుమతీ అవసరం లేదు. ఆ పరిమితి మీరినప్పుడే సమస్య. మార్కెట్లోకి లక్షల సంఖ్యలో వచ్చిన డ్రోన్ల వల్ల ఉత్పన్నమయ్యే భద్రతా సమస్యలపై ఆందోళన నెలకొంది.
డ్రోన్లను నిర్వీర్యం చేయొచ్చు.... కానీ....
సంఘవిద్రోహ శక్తులు- నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న దేశాల అంతరిక్ష పరిధుల్లోకి ప్రవేశించే, విమానాశ్రయాల్లోకి అక్రమంగా చొరబడి సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రమాదాలు ఉన్నాయి. అనుమానాస్పద డ్రోన్లను నిర్వీర్యపరచడం సాధ్యమే అయినప్పటికీ అది అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. అందుకే కౌంటర్-డ్రోన్ పరిజ్ఞానాన్ని గణతంత్ర దినోత్సవ సంబరాలు, అంతర్జాతీయ సదస్సులు, ప్రముఖ నాయకుల సమావేశాల వంటి కీలక సమయాల్లోనే ఉపయోగిస్తున్నారు. దేశంలో వందకు పైగా డ్రోన్ తయారీ సంస్థలు ఉన్నప్పటికీ తక్కువ సంస్థలు మాత్రమే ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (డీజీసీఏ) నిబంధనలకు లోబడి పనిచేస్తున్నాయి.
దేశంలోకి దిగుమతి చేసుకుంటున్న డ్రోన్లను నిబంధనలకు లోబడి తయారు చేస్తున్నారా లేదా అని పర్యవేక్షించే వ్యవస్థలూ సరిగా లేవు. నిబంధనలు తెలిసిన, శిక్షణ పొందిన డ్రోన్ పైలెట్లు తగిన మేరకు లేరు. డ్రోన్ పైలెట్ శిక్షణలో కొన్ని ప్రైవేటు సంస్థలు ముందున్నాయి. హైదరాబాద్ సహా పలు నగరాల్లో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (ఎన్‌ఎస్‌టీఐ) ద్వారా ప్రభుత్వం డ్రోన్ పైలెట్ కోర్సును ప్రారంభించింది. అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో వీటి ఉపయోగంవల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది. డాక్యుమెంటరీలు, ప్రైవేటు కార్యక్రమాల పేరుతో ఉపయోగించడంవల్ల ప్రజల గోప్యతపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని డ్రోన్ల వినియోగంపై స్పష్టమైన నిబంధనలు రూపొందించడం అవసరం!
-అనిల్ కుమార్ లోడి