కరోనా మహమ్మారిపై భారత పోరాటం సుదీర్ఘంగా సాగుతుందని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ యుద్ధంలో అలసిపోవడం గానీ, ఓటమిని అంగీకరించడం కానీ చేయొద్దని వ్యాఖ్యానించారు. ఈ పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదే విశ్వాసంతో.. ఒకే లక్ష్యం-సంకల్పంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
''దేశ ప్రజలందరూ మహాయుద్ధానికి సిద్ధమయ్యారు. నేను పూర్తి అవగాహనతో చెప్తున్నా. ఈ రణం సుదీర్ఘ పోరాటం. విశ్రాంతికి గానీ.. వెనుదిరిగేందుకు గానీ అవకాశమే లేదు. యుద్ధంలో కచ్చితంగా గెలిచితీరాలి. ఇవాళ భారత దేశ లక్ష్యం ఒక్కటే. ప్రతి ఒక్కరి సంకల్పం కూడా ఒక్కటే... అది కరోనా మహమ్మారిపై విజయం సాధించడమే. 130 కోట్ల మంది భద్రత.. యావత్ మానవాళికే రక్ష. మానవత్వానికే రక్ష.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
భాజపా 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని. ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తూ విపక్షాలు చేసే విమర్శలపైనా స్పందించారు. భారత దేశ ప్రయత్నాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని.. డబ్ల్యూహెచ్ఓ సహా ప్రపంచ దేశాధినేతలే కొనియాడారని గుర్తుచేశారు.
వేగంగానే స్పందించాం..
కరోనా మహమ్మారి తీవ్రతను సరైన సమయంలో అర్థం చేసుకొని, నియంత్రణ చర్యలు, ప్రయత్నాలు ప్రారంభించిన కొన్ని దేశాల్లో భారత్ ఒకటని వెల్లడించారు మోదీ. ఈ తరుణంలోనే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చిందన్నారు. వైరస్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు విమర్శించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని.
''వేగంగా, సమగ్ర రీతిలో భారత్ తీసుకున్న నిర్ణయాలను.. దేశ వాసులే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొనియాడింది. ఇంకా జీ-20, సార్క్ సమావేశాలను నిర్వహించడంలో భారత్ ప్రముఖ పాత్ర పోషించింది.''
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
అదే తెగువ చూపించాలి...
ప్రస్తుతం మానవజాతి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న ప్రధాని.. కరోనా కారణంగా ఒక్క భారత్ సహా ప్రపంచమంతా కష్టకాలంలో ఉందని పేర్కొన్నారు. కరోనా నివారణకు అన్ని దేశాలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు.
లాక్డౌన్ సమయంలో.. దేశ ప్రజలు అసాధారణ పరిణతి ప్రదర్శించారని, మున్ముందూ ఇది కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ వంటి అతిపెద్ద దేశంలో ప్రజలు ఇంత క్రమశిక్షణ, పరిపక్వతతో ఉంటారని ఎవరూ ఊహించి ఉండరని, ఆదివారం రాత్రి ఇది స్పష్టమైందని పేర్కొన్నారు. అన్ని వయస్సుల వారు దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి ఐక్యతను చాటారని మోదీ కొనియాడారు.
పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకాలు..
భాజపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు మోదీ. పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని అభ్యర్థించారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించిన మార్గదర్శకాలను అంతా పాటించాలని కోరారు.
5 పాయింట్ల అజెండా..
- ఆకలితో అలమటిస్తున్న పేదలందరికీ భోజనం అందించాలి.
- ఒక్కొక్కరు 5 నుంచి 7 మందికి మాస్కులు అందించాలి.
- నర్సులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, పోస్టాఫీస్, బ్యాంకు ఉద్యోగులు.. అత్యవసర సిబ్బందికి సంఘీభావంగా ఇతరుల నుంచి 'థాంక్యూ' సంతకాలు సేకరించాలి.
- కరోనా వైరస్‌పై అవగాహన కల్పించే ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలి.
- పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ఇచ్చేలా మరో 40 మందిని ప్రోత్సహించాలి.