షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) 19వ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాదిలోనే జరిగే ఈ సమావేశాల్లో సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు పాల్గొననున్నారు. ఎస్‌సీఓ విధివిధానాల మేరకు మొత్తం ఎనిమిది సభ్య దేశాలు, మరో నాలుగు పరిశీలక దేశాలు, ఇతర అంతర్జాతీయ చర్చల భాగస్వాముల్నీ ఆహ్వానించనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంతకుముందే స్పష్టీకరించింది. ఇదంతా సాధారణ వ్యవహారమే అయినా, ఈ సమావేశాలకు పాకిస్థాన్‌ను కూడా ఆహ్వానించనుండటం చాలామంది పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పాకిస్థాన్ ఎస్‌సీఓలో సభ్య దేశమే. అయినప్పటికీ, తన భూభాగాన్ని కేంద్రంగా చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రసంస్థలకు వ్యతిరేకంగా, అందరూ విశ్వసించేలా, నిక్కచ్చిగా పాక్ చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఆహ్వానం పలుకుతారనే వార్తలు ఆశ్చర్యానికి కారణమయ్యాయి. దీంతో భారత్ అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకుందా, సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ వస్తారా... వంటి ప్రశ్నలెన్నో చుట్టుముడుతున్నాయి.
చైనా ఆధిపత్యం..
ఎస్‌సీఓలో కీలక దేశమైన చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను పరిశీలించాల్సి ఉంది. చైనా అనూహ్య ఎదుగుదల, దాని ఆకాంక్షలు, దూకుడు వంటివి ఇండో పసిఫిక్ ప్రాంతంలో భౌగోళిక వ్యూహాత్మక సమతౌల్యాన్ని కదిలించి వేశాయి. గత 200 ఏళ్లలో ఏ దేశమూ చైనా తరహాలో తన నావికా దళాన్ని బలోపేతం చేసుకోలేకపోయిందనేది సుస్పష్టం. చైనా చాలా పొరుగుదేశాలతో పంచాయతీలు పెట్టుకుంది. జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్, భారత్ వంటి పొరుగు దేశాలతో గిల్లికజ్జాల్ని కొనసాగిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చాలా ప్రాంతంపై ఇప్పటికే పూర్తిస్థాయి నియంత్రణ సాధించింది. కరాచీ, డిజిబౌటి, ఇతర దేశాల్లో సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేసే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. తన వద్దగల భారీ స్థాయి విదేశ మారక ద్రవ్య నిల్వల్ని అడ్డం పెట్టుకుని, బెల్ట్, రోడ్డు కార్యక్రమం(బీఆర్‌ఐ) ద్వారా పలు దేశాల్ని రుణ ఊబిలోకి దింపుతూ, కబంధ హస్తాల్లోకి లాగేసుకుంటోందనే విమర్శలున్నాయి. ఈ సవాళ్లకుతోడు, నాలుగు దశాబ్దాలుగా పొరుగు దేశమైన పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న భయంకరమైన ఉగ్రవాదంతో భారత్ బాధ పడుతోంది. ఇది చైనాకు అత్యంత ఆప్తదేశం కావడం విశేషం. భారత్ ఎదుగుదలను అడ్డుకోవడమే ఈ రెండు దేశాల లక్ష్యం. వివాదాస్పద అంశాలన్నింటినీ పరిష్కరించుకోవడానికి భారత్ 60 ఏళ్లుగా ఓపిక వహిస్తూ పాకిస్థాన్‌తో సంప్రతింపులు సాగిస్తోంది. శాంతియుత మార్గంలో కలిసి సాగేందుకు యత్నిస్తున్నా, తన ఉగ్రధోరణిని పాకిస్థాన్ విడచిపెట్టలేదు. దీంతో విసిగిపోయిన భారత్- ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి కుదరవని తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ప్రధానమంత్రిని ఎస్‌సీఓ సమావేశానికి ఆహ్వానించే అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల చేసిన ప్రకటన పరిశీలకుల్లో ఆశ్చర్యాన్ని రేకెత్తించింది.
2001లో ఏర్పాటు..
ఎస్‌సీఓ 2001లో చైనా నేతృత్వంలో ఏర్పాటైంది. ఇందులో రష్యా, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, తజికిస్థాన్, కిర్గిజిస్థాన్ సభ్యులుగా ఉన్నాయి. ‘నాటో’కు ప్రతిగా సభ్య దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సుసాధ్యం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైంది. 2017లో రష్యా సహకారంతో భారత్ ఎస్‌సీఓలో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని సాధించింది. అదే ఏడాది చైనా సహాయ సహకారాలతో పాకిస్థాన్ కూడా ఎస్‌సీఓలో చేరింది. భారత్ తొలిసారిగా ప్రభుత్వాధినేతల సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. పొరుగు దేశం పాకిస్థాన్‌ను ఆహ్వానించక తప్పని పరిస్థితి మనదేశానిది. లేకపోతే, సదస్సే రద్దయిపోతుంది. భారత్ నిర్మాణాత్మక, సానుకూల పాత్ర పోషించేందుకు కట్టుబడి ఉంది. ఈ క్రమంలో అనవసరపు సమస్యలు తలెత్తేలా వ్యవహరించకపోవచ్చని భావిస్తున్నారు. రష్యాతో మరింత గాఢమైన సంబంధాలు కోరుకుంటున్న భారత్, చైనాతో సంబంధాల్ని కొనసాగిస్తూ, మధ్యాసియా దేశాలతో సత్సంబంధాల్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఎస్‌సీఓ సదస్సుకు సంబంధించి ఆహ్వానం అందితే, పాకిస్థాన్ ప్రధానమంత్రి భారత్‌ను సందర్శించే అవకాశాన్ని జారవిడుచుకోకపోవచ్చని ఒక అంచనా. మరోవైపు, ప్రధాని ఇమ్రాన్ రాకుండా, ప్రతినిధి బృందాన్ని పంపించే అవకాశాలూ లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్‌పై ఒత్తిడి పెంచేందుకే..
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు చైనా పదేపదే చేస్తున్న ప్రయత్నాల వెనక ముఖ్య లక్ష్యం- పాకిస్థాన్‌తో సంప్రతింపులు జరిపేలా భారత్‌పై ఒత్తిడి పెంచడమే. ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్) నిషిద్ధ జాబితాలో చేర్చే ముప్పు పాకిస్థాన్ ముంగిట పొంచిఉంది. ఈ క్రమంలో ఎఫ్‌ఏటీఎఫ్ వెనకడుగు వేసేలా, ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యే దిశగా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర నెగళ్లను ఎగదోయడాన్ని కొనసాగిస్తుంది. ఏదేమైనా, పాకిస్థాన్‌తో చర్చల్ని పునఃప్రారంభించడం లేదా ఎస్‌సీఓ సదస్సుకు ఆహ్వానించడం వంటివి ఆ సంస్థలో సభ్యత్వానికి భారత్ చెల్లించుకోవాల్సిన మూల్యంగా భావించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- విష్ణు ప్రకాశ్, (రచయిత, మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల విశ్లేషకులు)