భారత్-అమెరికా సంబంధాలు మరో మైలురాయిని చేరుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసున్న బెకా(బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్) ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. దిల్లీలో జరిగిన మూడవ 'టూ ప్లస్ టూ' సమావేశాల్లో ఈ అధికారిక ప్రక్రియ పూర్తయింది. ఈ భేటీలో రెండు దేశాలకు చెందిన విదేశాంగ, రక్షణ శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
బెకా ఒప్పందంతో అత్యున్నత సైనిక సాంకేతికత, రహస్య శాటిలైట్ డేటా, ఇరుదేశాలకు చెందిన కీలక సమాచారాన్ని భారత్-అమెరికా ఇచ్చిపుచ్చుకోనున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ ఒప్పందం భారత్‌కు ఎంతో కీలకంగా మారింది. అంతేకాకుండా అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు మరింత మెరుగుపడతాయి.
రాజ్‌నాథ్ స్పందన..
అమెరికా, భారత్ మధ్య పరస్పర సైనిక సహకారం ఎంతో పురోగతి సాధించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఒప్పందంతో పొరుగు దేశం సహా ఇతర దేశాల్లో సంయుక్త కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం లభిస్తుందని చెప్పారు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని సమర్థిస్తూ.. నిబంధనలను గౌరవిస్తూ అంతర్జాతీయ సముద్రంలో స్వేచ్ఛ నెలకొనేలా ముందుకు సాగాలని ఇరు దేశాల నిర్ణయించినట్లు రాజ్‌నాథ్ వెల్లడించారు.
చైనా ఆటలు సాగనివ్వం..
రెండు దేశాల మధ్య భాగస్వామ్యం గతంలో కంటే ఇప్పుడే అత్యంత ముఖ్యమని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ అన్నారు. కరోనా సంక్షోభం, భద్రతా సవాళ్లు పెరుగుతున్న వేళ ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం నెలకొల్పడం కీలకమన్నారు. ఇండో-పసిపిక్ ప్రాంతంలో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనాను నిలువరించి ఆ ప్రాంతంలో స్వేచ్ఛను కాపాడేందుకు భారత్‌కు అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తామని ఎస్పర్ స్పష్టం చేశారు.
భారత్‌కు అండగా ఉంటాం..
భారత ప్రజల స్వేచ్ఛ, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే సహించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తేల్చి చెప్పారు. భారత్‌కు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గల్వాన్ లోయ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది భారత సైనికుల స్మారకానికి నివాళులు అర్పించిన అనంతరం వారి త్యాగాలను కొనియాడారు పాంపియో. చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రజాస్వామ్య విలువలు పట్టవని ధ్వజమెత్తారు.
నాలుగో కీలక ఒప్పందం
- భారత్-అమెరికా మధ్య 2002లో 'జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్'(జీఎస్‌ఓఎంఐఏ) కుదిరింది. భారత్‌తో అమెరికా పంచుకున్న కీలకమైన సమాచారానికి భద్రత కల్పించేందకు అవసరమైన ప్రమాణాలను ఇది అందించింది.
- 2016లో భారత్‌ను కీలక రక్షణ భాగస్వామిగా ప్రకటించింది అమెరికా. అదే ఏడాది రెండు దేశాల మధ్య 'లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్' కుదిరింది.
- 2018లో రెండు దేశాల మధ్య 'కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్' కుదిరింది. దీని ద్వారా భారత్-అమెరికా సైనికపరంగా పరస్పర సహకారం అందించుకునేందుకు అంగీకరించాయి. అమెరికా నుంచి అత్యాధునిక సాంకేతికతను భారత్ కొనుగోలు చేసేందుకు మార్గం సుగమమైంది.
- తాజాగా కుదిరిన బెకా ఒప్పందంతో అమెరికా నుంచి భౌగోళిక-ప్రాదేశిక సమాచారంతో పాటు, సైనికపరమైన కీలక సమాచారాన్ని భారత్ పొందనుంది.