పులుల సంరక్షణకు ఇతర దేశాలతో కలిసి పనిచేయడం సహా... టైగర్ రేంజ్ దేశాలకు నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు.
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా.. దేశంలోని 50 పులుల సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన నివేదికను మరో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోతో కలిసి విడుదల చేశారు జావడేకర్. భారత్‌లోని 50 సంరక్షణ కేంద్రాలూ ఉత్తమ, అత్యుత్తమైనవేనన్న ఆయన.. మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పులుల సంచారం అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రపంచంలోని 70 శాతం పులులు భారత్‌లోనే ఉండటం గర్వకారణమన్నారు జావడేకర్. భారత పులుల గణనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడమే ఇందుకు నిదర్శనమన్నారు.
"1973లో దేశవ్యాప్తంగా కేవలం 9 టైగర్ రిజర్వ్ లున్నాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య 50 కి పెరిగింది. అవన్నీ మంచి నాణ్యత కలిగి ఉండటం గమనించదగిన విషయం. భారత భూభాగం ప్రపంచ భూభాగంలో 2.5 శాతం కలిగి ఉంది. అయినా, జీవవైవిధ్యంలో మాత్రం దాదాపు 8 శాతం భారత్ సొంతం. అంతే కాదు, ప్రపంచ పులుల సంఖ్యలో దాదాపు 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి. అందుకే దాదాపు 12 టైగర్ రేంజ్ దేశాలకు పులుల సంరక్షణ కేంద్రాల నిర్వహణలో నాయకత్వం వహించనుంది భారత్."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి
2019లో ప్రధాన మంత్రి విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో 2,967 పులులు సంచరిస్తున్నాయి.
ఇదీ చదవండి: భారత 'పులుల గణన'కు గిన్నిస్ రికార్డ్‌లో చోటు