దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు టెస్టింగ్ కిట్లు, వైద్యులకు వ్యక్తిగత రక్షణ కల్పించే పరికరాల కొరత ఏర్పడింది. అందుకే దక్షిణ కొరియా నుంచి 5 లక్షల కొవిడ్-19 టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకుంటోంది భారత్.
ఈ మేరకు ఆ దేశ రాజధాని సియోల్‌లోని హుమాసిస్ అనే ఓ ఫార్మా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కిట్లను తయారు చేసేందుకు ముడి సరుకును భారత్ పంపిస్తోంది.
ఇప్పటికే చైనా నుంచి ఆరున్నర లక్షల టెస్టింగ్ కిట్లు, ద.కొరియా నుంచి దాదాపు నాలుగున్నర లక్షల టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకుంది కేంద్రం. మరిన్ని వైద్య పరికరాలను యూకే, యూఎస్, ఫ్రాన్స్, జపాన్, మలేసియా, జర్మనీ దేశాల నుంచి తెప్పించే ప్రయత్నాలు చేస్తోంది.
మహమ్మారిపై పోరాడటానికి ఉత్తమ పద్ధతులు, ఆవిష్కరణలు, శాస్త్రీయ పురోగతులు, వైద్య పరికరాలను తక్కవ ఖర్చుకే తయారీ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవలె 130 భారతీయ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి:53 మంది జర్నలిస్టులకు సోకిన మహమ్మారి