కొత్త ఏడాదికి యావత్ దేశం ఘన స్వాగతం పలికింది. భవిష్యత్తు కాంతులమయం కావాలని కోరుతూ.. కాల్చిన బాణసంచాతో భారత్ కొత్త శోభను సంతరించుకుంది. యువతీ యువకుల ఆటపాటలతో వాడవాడలా సందడి నెలకొంది.
దేశ రాజధాని దిల్లీవాసులు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. చిన్నాపెద్దా నృత్యాలు చేస్తూ సంతోషంలో మునిగితేలారు. 2020లో అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రజలు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ముంబయి వాసులు కోటి ఆశలతో 2020లోకి అడుగుపెట్టారు. వెలుగుల మధ్య పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని గేట్ వే ఆఫ్ ఇండియా విద్యుత్ దీపాలు, బాణాసంచ కాంతులతో వెలిగిపోయింది.
ఉత్తరాఖండ్లో విధులు నిర్వర్తించే ఐటీబీపీ జవాన్లు..... 2020కి ఘన స్వాగతం పలికారు. ఆటపాటలతో సందడిగా గడుపుతూ... పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ వాసులు కొత్త ఏడాదికి ఘనస్వాగతం పలికారు. నూతన సంవత్సరాది సందర్భంగా... పంజాబ్ అమృత్‌సర్ భక్తులతో కిటకిటలాడింది. భక్తులు పవిత్ర స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
దక్షిణాదిలో...
దక్షిణాది రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా సాగాయి. చెన్నై, బెంగళూరు,తిరువనంతపురం ప్రజలు ఆనందోత్సాహాల మధ్య 2020లోకి అడుగుపెట్టారు.
నూతన ఏడాదిని పురస్కరించుకుని గోవా రాజధాని పనాజీలో ఏర్పాటు చేసిన ప్రదర్శన కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. గోవాకు వచ్చిన విదేశీ పర్యాటకులు ఆటపాటలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. భారతీయ వంటకాల రుచి చూశారు.
ఇదీ చూడండి: గేట్ వే ఆఫ్ ఇండియాకు నూతన ఏడాది శోభ