కరోనా.. ప్రపంచదేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ భారత్ పెద్దమనసు చాటుకుంది. పలు దేశాల నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు విపరీతమైన డిమాండ్ దృష్ట్యా మానవతా దృక్పథంతో వ్యవహరించింది. భారత అవసరాల నిమిత్తం.. ఆ ఔషధంపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది విదేశాంగ శాఖ.
ప్రస్తుతానికి కొవిడ్-19 చికిత్సకు ఎలాంటి టీకాగానీ, ఔషధంగానీ లేవు. అయితే మలేరియాను నయం చేయడానికి వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఆశాజనక ఫలితాలు ఇస్తోందని పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వీటిని రోగులకు దగ్గరగా ఉండే వ్యక్తులు వాడొచ్చని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ), భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సూచించింది.
దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ మందుకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే మార్చి 25న ఈ ఔషధం ఎగుమతులపై నిషేధం విధించింది భారత్.
దేశీయ అవసరాలు తీరాకే...
పొరుగుదేశాలకు పారాసిటమాల్, హైడ్రాక్సీక్లోరోక్విన్ అవసరమైన మొత్తానికి లైసెన్స్ అనుమతులు కూడా ఇస్తున్నట్లు తెలిపారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ. ఆయా దేశాలకు అవసరమైన మేర మందులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు పేర్కొన్నారు.
అవసరమైన సమయంలో అంతర్జాతీయ సమాజాని్కి భారత్ బలమైన సంఘీభావాన్ని, సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు శ్రీవాత్సవ. అయితే.. దేశీయ అవసరాలు తీరిన తర్వాతే దశల వారీగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అయితే.. ఎగుమతిపై పూర్తి నిషేధాన్ని ఎత్తివేయకుండా కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ వార్నింగ్‌తో...
ప్రధాని మోదీతో ఆదివారం ఫోన్లో సంభాషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హైడ్రాక్సీ ఔషధాన్ని సరఫరా చేయాలని కోరారు. ఒకవేళ ఎగుమతిపై నిషేధం ఎత్తివేయకుంటే ప్రతీకారం తప్పదని పరోక్షంగా ఇవాళ హెచ్చరికలు పంపారు.
అమెరికానే కాకుండా నేపాల్, శ్రీలంక.. ఇలా దాదాపు 20 దేశాలు భారత్‌ను ఔషధం సరఫరా చేయాల్సిందింగా అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలోనే సానుకూలంగా వ్యవహరించిన భారత్.. నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.