యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన సమావేశంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. వ్యాపారానికి అనువైన ప్రాంతంగా ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని.. ఇక్కడ అవకాశాలతో పాటు స్వేచ్ఛ, సాంకేతికతపరంగా అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నట్లు స్పష్టం చేశారు మోదీ.
భారత్లో ఆరోగ్య సంరక్షణ, మౌలిక వసతులు, రక్షణ, శక్తి, వ్యవసాయం, బీమా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా కంపెనీలను ఆహ్వానించారు మోదీ. భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగినట్లు గుర్తుచేశారు. పెట్టుబడలకు నిలయంగా భారత్ అవతరిస్తోందన్నారు.
కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక స్థితిస్థాపకత ప్రాముఖ్యతను తెలియజేసిందని, బలమైన దేశీయ ఆర్థిక సామర్థ్యాల ద్వారా దీనిని సాధించవచ్చని మోదీ అన్నారు. భారత్లో.. పట్టణవాసుల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరిగినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించినట్లు చెప్పారు మోదీ. ఆర్థిక సంస్కరణలు పోటీతత్వం, పారదర్శకత, డిజిటలైజేషన్, ఆవిష్కరణలు, విధాన స్థిరత్వాన్ని నిర్ధరించాయన్నారు.