భారత సైనికులకు మున్ముందు ప్రధాన ఆయుధంగా మారనున్న ఏకే 203 తుపాకులను దేశీయంగా తయారు చేసేందుకు మార్గం సుగమమైంది. సంబంధించిన అడ్డంకులన్నింటికీ తొలగించిన కేంద్ర ప్రభుత్వం.. రష్యాతో ఒప్పందాన్ని ఖరారు చేసుకొంది. 'భారత్‌లో తయారీ'లో భాగంగా దాదాపు 6 లక్షలకు పైగా ఏకే 203 తుపాకుల్ని ఉత్పత్తి చేయనున్నారు. 2020 చివరి నాటికి అమేథీలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
దేశీయ వినియోగంతో పాటు ఎగుమతి సామర్థ్యంతో తయారు చేస్తారు. ఇందుకోసం 'ఇండో- రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేస్తారు. ఇందులో ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బీ)కి 50.5%, కలష్నికోవ్ కంపెనీకి 42%, రష్యా మిలటరీ పరికరాల ఎగుమతి ఏజెన్సీ అయిన రోసోబోరాన్కు 7.5% వాటా ఉంటుంది. ఒప్పందంలో భాగంగా తొలుత 20 వేల తుపాకులను ఒక్కొక్కటి రూ.80 వేల చొప్పున రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. అనంతరం భారత్‌లో తయారీ ద్వారా ఒక్కో యూనిట్ ఖర్చు అంతకంటే తక్కువయ్యేలా చూస్తారు.
ఏకే 47ను మించిన ఆయుధం!
రష్యాకు చెందిన కలష్నికోవ్ కంపెనీ తయారుచేసే తుపాకుల్లో ఏకే 203 అత్యంత ఆధునికమైనది. ఈ సంస్థ ఉత్పత్తి అయిన ఏకే 47 కంటే దీనికి దాడి సామర్థ్యం ఎక్కువ. ఏకే 47 మాదిరిగానే ఏకే 203లో కూడా 7.62x39 ఎంఎం మందుగుండు ఉంటుంది. అయితే షూటర్ తన ఎత్తుకు తగ్గట్టుగా సరిచేసుకొనే అవకాశం కొత్త తుపాకీలో ఉంది. దీనివల్ల ఫైరింగ్ మోడ్లు మారుస్తున్న సమయంలో సైనికుడు ఆయుధం పట్టు కోల్పోడు. అదీకాక రాత్రి వేళ వినియోగానికి వీలుగా నిగూఢంగా ఫ్లాష్ సౌకర్యం అమర్చారు. మన దేశంలో 1999 నుంచి సైనికులు వినియోగిస్తున్న ఇన్సాస్( 5.56x45 ఎంఎం ) తుపాకుల స్థానంలో ఏకే 208లు వాడనున్నారు.
4 , 5న భారత్ - రష్యా సంయుక్త నేవీ విన్యాసాలు
తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత్ తన చిరకాల మిత్రదేశం రష్యాతో కలిసి సంయుక్త నావికాదళ విన్యాసాలకు సిద్ధమైంది ఇరుదేశాల నావికా దళాలు ఈనెల 4, 5 తేదీల్లో బంగాళాఖాతంలో మెగా మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తాయని రక్షణ శాఖ అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి. భవిష్యత్తు భద్రతా సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవడం, నిర్వహణా సామర్థ్యాలను మెరుగుపరచుకొనేందుకే ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా.. ఉపరితల, వైమానిక లక్ష్యాలపై కాల్పులు జరపడం, సముద్ర గస్తీ వాహనాలలో ఖాళీ అయిన సామగ్రిని తిరిగి నింపడం వంటివి చేస్తారు.
వాస్తవానికి ఈ విన్యాసాలు ఈ ఏడాది మొదట్లో రష్యాలోని వాదివోత్సక్లో నిర్వహించాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో జరిగే విన్యాసాలలో రష్యాకు చెందిన అడ్మిరల్ వినొగ్ర దొవ్, అడ్మిరల్ త్రిబుట్స్, బోరిస్ బుటోమా వంటి యుద్ధ నౌకలు, హెలికాఫ్టర్లు పాల్గొంటాయి. భారత్ నేవీ నుంచి రణవిజయ్, సహ్యాద్రి, కిల్తాన్, శక్తి యుద్ధనౌకలు సహా హెలికాఫ్టర్లు పాల్గొంటున్నాయి. ఇరు దేశాల త్రివిధ దళాలు 2005 నుంచి 'ఇంద్ర' పేరిట సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.