తన దురుసు ప్రవర్తనతో గతంలో వార్తల్లో నిలిచిన జమ్ముకశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారి బసంత్ రథ్.. మరోసారి వివాదం సృష్టించారు. ఇప్పుడు ఏకంగా జమ్మూ డీజీపీ దిల్బాగ్ సింగ్‌పైనే ట్విట్టర్ వేదికగా నిరాధార ఆరోపణలు గుప్పించారు.
వివరాల్లోకి వస్తే.. దిల్బాగ్ సింగ్ పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ ఖాతా నుంచి రథ్‌పై ట్వీట్ రావడమే వివాదానికి కారణమైంది. ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ఉదహరిస్తూ.. 'ఎవరో అపరిచితులు తన చదువుల కోసం సాయం చేశారు. అందుకే బదులుగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు' అని రథ్ ఖాతాను ట్యాగ్ చేస్తూ దిల్బాగ్ సింగ్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు.
ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన బసంత్... డీజీపీ దిల్బాగ్ సింగ్‌పైనే తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
''హాయ్ దిల్బాగ్ సింగ్. నేను నిన్ను దిల్లూ అని పిలవచ్చా? సరోరేలో దంత కళాశాల సమీపంలో మీకు 50 కెనాళ్ల భూమి ఉంది కదా? అది నీ పేరు మీదే ఉందా?''
- బసంత్ రథ్ ట్వీట్
ఈ ఒక్క ట్వీట్‌తో ఆ డీజీపీకి పెద్ద చిక్కొచ్చిపడింది. ఆ ట్వీట్ డీజీపీ దిల్బాగ్ సింగ్‌ను ఉద్దేశించే చేసిందా..? లేక వేరెవరైనా అని కశ్మీర్ మొత్తం చర్చించుకున్నారు. సీనియర్ అధికారులు, జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూపులోనూ దీనిపై పెద్ద చర్చే నడిచింది.
ఈ ఆరోపణలపై అదే గ్రూపులో స్పందించిన డీజీపీ దిల్బాగ్ సింగ్.. ట్వీట్ చేసిన వ్యక్తికి సవాల్ విసిరారు. దీనితో బసంత్ రథ్ చేసిన ట్వీట్లు తనను ఉద్దేశించనవే అని డీజీపీ అంగీకరించినట్లయింది.
''నా పేరు మీద, నా కుటుంబ సభ్యుల పేరు మీద.. అంగుళం భూమైనా, ఆస్తులు, ఇతర వ్యాపారాలు ఏమైనా ఉంటే సాక్ష్యాలతో నిరూపించాలని అతనికి సవాల్ విసురుతున్నా.''
- ఓ అనధికారిక ప్రకటనలో డీజీపీ దిల్బాగ్ సింగ్
డీజీపీనే అంటావా..!
కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ కూడా.. బసంత్ రథ్‌ను తీవ్రంగా మందలించారు. ఇదొక క్రమశిక్షాణారాహిత్య చర్యగా అభివర్ణించారు. డీజీపీని చూసి గర్విస్తున్నామని అన్నారు.
''ఐజీపీ బసంత్ క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘిస్తూ.. పోలీసు దళాలకు ముప్పును సృష్టిస్తున్నారు. ఒకవేళ ఆయన దగ్గర సాక్ష్యాలేమైనా ఉంటే.. నేరుగా ఫిర్యాదు చేయాలి. దిల్బాగ్ సింగ్ ఐపీఎస్.. గొప్ప పోలీస్. ఆయనను చూసి మేం గర్విస్తున్నాం. ఆయన నాయకత్వంలో మేమెంతో నేర్చుకుంటున్నాం.''
- కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్
అయితే.. ఇలా వివాదాలు సృష్టించడం ఐజీపీ రథ్‌కు కొత్తేమీ కాదు. గతేడాది మాజీ డీజీపీ ఎస్పీ వైద్పైన ఇలాగే అనుచిత విమర్శలు చేశారు.
ఆ నేతపైనా బెదిరింపులు..!
ఇదే సమయంలో.. రథ్ తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని స్థానిక పీడీపీ మాజీ శాసనసభ్యుడు ఖుర్షీద్ ఆలం శనివారం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం శ్రీనగర్ పీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. మాజీ ట్రాఫిక్ ఐజీ బసంత్ రథ్‌పై హుంహామా పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ చేశారు. ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు.