ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అయిదు శాతానికి పడిపోయింది. ఇది ఏడేళ్ల కనిష్ఠం. ఆహార ధరల పెరుగుదల కారణంగా చిల్లర ద్రవ్యోల్బణం ఆగస్టులో పది నెలల గరిష్ఠానికి చేరింది. 2019 మే నెలలో నిరుద్యోగిత రేటు 6.1 శాతం. ఇది 45 ఏళ్ల అత్యధిక స్థాయి. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే మహారాష్ట్ర, హరియాణాల్లోనూ వ్యవసాయ సంక్షోభం, ఆహార ధరల పెరుగుదల, నిరుద్యోగిత పెచ్చరిల్లడం వంటి సమస్యల్ని ప్రజలు ఎదుర్కొన్నారు. మరోవైపు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అశక్తత కారణంగా కొన్ని వర్గాల ఓటర్లలో అసంతృప్తి సైతం మొదలైంది.
ఇలాంటి సమస్యల విషయంలో ఓటర్లలో ఆగ్రహాన్ని చల్లార్చేందుకు భాజపా మహారాష్ట్రలో ప్రత్యర్థి కాంగ్రెస్, ఎన్‌సీపీ శిబిరాల్లోని చీలిక నేతలపైనే అధికంగా ఆధారపడింది. హరియాణాలో వ్యతిరేక పార్టీల్లో నెలకొన్న అనైక్యతనే నమ్ముకుంది. వీటితోపాటు అధికరణ 370 రద్దు, జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ) అమలు వంటి అంశాలపై పెద్దయెత్తున ప్రచారం చేసింది. యాదృచ్ఛికంగా పోలింగుకు ఒకరోజు ముందు అక్టోబర్ 20న నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పులకు తెగబడింది. అందుకు ప్రతిగా భారత సైన్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. జాతీయ భద్రతపై ఓటర్లలో భయాందోళనలు రేగాయి. అయినా ఓటింగ్ తీరుపై దాని ప్రభావం పడలేదు.
మెరుగైన కాంగ్రెస్ పనితీరు
మొత్తానికి కమలదళం వ్యూహం ఫలించినా, అనుకున్న స్థాయిలో కాదని స్పష్టమవుతోంది. మహారాష్ట్రలో భాజపా, శివసేన కలిపి 161 సీట్లు కైవసం చేసుకున్నాయి. 2014లో అక్కడ భాజపా సొంతంగా 122 సీట్లు నెగ్గింది. ఈసారి 105 స్థానాలకే పరిమితమైంది. హరియాణాలో భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజారిటీకన్నా తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014లో 47 స్థానాలు సాధించగా, ఈసారి 40 స్థానాలకే పరిమితమైంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేర్పిన పాఠంతో- జాతీయ భద్రత, మతపరమైన ఏకీకరణ అంశాల్ని లేవనెత్తే విషయంలో రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా జాగ్రత్త పడుతుందని భావించాలి.
భాజపా ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి నిలబెట్టిన నేతల్లో చాలామంది ఓడిపోయారు. మరికొన్ని వారాల్లో ఝార్ఖండ్‌లో, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఫిరాయింపుదారులకు పార్టీ ఎన్నికల చిహ్నాన్ని ఇచ్చే విషయంలో అది మరింత జాగ్రత్తగా ఉంటుందని భావించవచ్చు. మహారాష్ట్ర, హరియాణాల్లో భాజపా కార్యకర్తలు సంబరాల్లో మునిగినా, తాజా ఫలితాలు విపక్ష శ్రేణుల్లో సైతం ఉత్సాహాన్నే నింపాయి. మహారాష్ట్రలో భాజపా వ్యతిరేక పార్టీలు కొంత తగ్గాయే కానీ, పూర్తిగా దెబ్బతినలేదని తేలింది. ఇది కీలకమైన అంశం. అయిదు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే మహారాష్ట్రలో 51.3 శాతం, హరియాణాలో 58.3 శాతం ఓట్లవాటాను సాధించి విపక్షాలను మట్టి కరిపించింది.
అయితే, అవి చాలా త్వరగా కోలుకొన్నాయి. కమలం పార్టీకి గట్టిపోటీని ఇచ్చాయి. విపక్షాలు మహారాష్ట్ర, హరియాణాల్లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిని సాధించలేకపోయినా, అవన్నీ కలిసి సమగ్ర వ్యూహంతో పోరాడితే భాజపాను ఓడించగలవని వాటి పనితీరు సూచిస్తోంది. హరియాణాలో కాంగ్రెస్ మెరుగైన విజయాల్ని సాధించడంతో చాలా వర్గాల్లో ఆ పార్టీ పట్ల ఆకర్షణ తగ్గలేదని తెలుస్తోంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భూపీందర్ సింగ్ హుడాను కేవలం జాట్ వర్గం నేతగా భాజపా పెద్దయెత్తున ప్రచారం చేసినా, హస్తం పార్టీ 31 సీట్లు సాధించింది. జాట్‌లు, ఇతర వర్గాల మధ్య పోటీ నెలకొన్న క్రమంలో భాజపా అనేక స్థానాల్లో ఇతర వర్గాలన్నింటినీ పూర్తి స్థాయిలో తన వెనక నడిపించలేకపోయినట్లు తెలుస్తోంది. పలు ఇతర కులాలు భాజపాకన్నా కాంగ్రెసే మెరుగైన ప్రత్యామ్నాయంగా భావించాయి. కాంగ్రెస్ అధినాయకత్వానికి చెందిన కుటుంబ నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నా, హరియాణాలో కాంగ్రెస్ చక్కటి ఫలితాల్ని సాధించడం కీలకమనే చెప్పాలి.
పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మహేంద్రగఢ్ సభలో ప్రసంగించాల్సి ఉండగా, చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. పార్టీ నేత రాహుల్‌గాంధీ రెండు సభల్లో మాత్రమే ప్రసంగించారు. మహారాష్ట్రలో సైతం అయిదు సభలకే పరిమితమయ్యారు. సోనియా మహారాష్ట్ర ప్రచార బరికి దూరంగా ఉండిపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో తీవ్రస్థాయిలో ప్రచారం చేసిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ రెండు రాష్ట్రాల వైపు కన్నెత్తయినా చూడలేదు. సోనియా, రాహుల్, ప్రియాంకల గైర్హాజరీతో రెండు రాష్ట్రాల శాఖలు కొంత నిరాశ చెందినా, భాజపా వ్యతిరేక ఓటర్లు కాంగ్రెస్‌పైనే నమ్మకం ఉంచారు.
అందువల్లే మహారాష్ట్ర, హరియాణాల్లో ఫలితాల్లో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోగలిగింది.
రెండు రాష్ట్రాల్లో భాజపా సంఖ్యాబలం తగ్గడంతో, రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలపైనే అతిగా ఆధారపడటం, వారినే ఎక్కువగా ముందుంచి ప్రచారం చేసే విషయంలో పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ 16 సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా మహారాష్ట్రలో 16, హరియాణాలో 12 సభల్లో పాల్గొన్నారు.
జాతీయ రాజకీయాలపై ప్రభావం
రెండు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాల్ని సాధించకపోవడంతో ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా ఇతర కులాలను ఏకతాటిపై తీసుకొచ్చే తన వ్యూహాన్ని మార్చుకునే దిశగా యోచించవచ్చు. మహారాష్ట్రలో 31 శాతంతో మరాఠాలు ఆధిపత్య వర్గంగా ఉన్నారు. అయిదేళ్ల క్రితం మరాఠాయేతర నేత దేవేంద్ర ఫడణవీస్‌ను ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి ఎన్నికలకు ముందు పలువురు మరాఠా నేతలు భాజపా, శివసేనల వైపు నడిచినా, ఆ వర్గం ఓటర్లు సంప్రదాయంగా తాము అభిమానించే ఎన్‌సీపీ, కాంగ్రెస్ పట్లే విధేయత కనబరచినట్లు స్పష్టమవుతోంది.
జాట్ వర్గం ఆధిపత్యం ఉండే హరియాణాలో పంజాబీ నేత మనోహర్‌లాల్ ఖట్టర్‌ను 2014లో ముఖ్యమంత్రిగా భాజపా ఎంపిక చేసింది. 30శాతంతో బలంగా ఉండే జాట్ ఓటర్లలో భాజపాపై ఆగ్రహం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, జేజేపీలు నిలబెట్టిన జాట్‌యేతర అభ్యర్థులు సైతం గెలిచేలా చేసి, భాజపా నిలబెట్టిన జాట్ అభ్యర్థులను ఓడించారు. ఈ క్రమంలో భాజపాలోని జాట్ అభ్యర్థులైన రాష్ట్ర ఆర్థికమంత్రి కెప్టెన్ అభిమన్యు, వ్యవసాయ మంత్రి ఓపీ ధంకడ్ సైతం ఓడిన నేతల వరసలో చేరారు. ఒక ఆధిపత్య కులానికి వ్యతిరేకంగా, పలు ఇతర కులాలన్నింటినీ ఒక్కతాటిపైకి చేర్చే భాజపా వ్యూహం ఈసారి అనుకున్న ఫలితాల్ని ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం గుర్తెరిగి ఝార్ఖండ్‌లో జాగ్రత్త వహించక తప్పదు. అక్కడ 26 శాతం గిరిజనులే ఉన్నారు.
2014లో గిరిజన, గిరిజనేతర కార్డును ప్రయోగించి, ఓబీసీ నేత రఘుబర్‌దాస్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. తాజా అసెంబ్లీ ఫలితాలతో శివసేన, ఎన్‌సీపీలు జాతీయ రాజకీయాల్లో తమదైన వైఖరిని కొనసాగించే అవకాశం ఉంది. శివసేన ఇప్పటికే రాష్ట్రంలో సమాన అధికారం ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తోంది. ఇకపైనా జాతీయస్థాయిలో అది భాజపాపై విమర్శల్ని కొనసాగించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో మరోసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, రాబోయే రోజుల్లో కమలం-సేనల మధ్య విభేదాలు తీవ్రతరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఎన్‌సీపీ నేతలపై అవినీతి, దేశవ్యతిరేక ఆరోపణలు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థల వైఖరిలోనూ మార్పులొచ్చే అవకాశాలూ లేకపోలేదు. ఈసారి ఎన్‌సీపీ సంఖ్యాబలం పెరగడంతో, పార్టీ అధినేత శరద్ పవార్‌లో నైతిక స్థైర్యం ఇనుమడించే అవకాశం ఉంది.
ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో భాజపా నాయకులపై పడుతుంది. కీలకమైన బిల్లుల విషయంలో ఎన్డీయేతర పక్షాలను సంప్రతించే విషయంలో మరింత రాజీ ధోరణితో వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. తాజా ఫలితాలతో కమలదళం జాతీయవాదం, మతపరమైన ప్రచారాస్త్రాలకు ఆకర్షణ పరిమితంగా ఉంటుందన్న వాస్తవం గ్రహించి, అసలు సమస్యలైన వ్యవసాయ సంక్షోభం, ఆహార ధరల పెరుగుదల, నిరుద్యోగిత వంటి అంశాలపై తగినంత దృష్టి పెడుతుందని భావించవచ్చు.
పాత నేతల కొత్త జోరు..
మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లు అధికారాన్ని అందుకోలేక పోయినా, ఆ పార్టీలను నడిపించిన సీనియర్ నేతలు మరోసారి తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకునేందుకు ఈ ఎన్నికలు వేదికగా నిలిచాయి.
శరద్‌పవార్...
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయిలో బలమైన నేతలేక, అంతర్గత కుమ్ములాటలతో సతమతమయ్యింది. 78 ఏళ్ల శరద్ పవార్ విపక్ష ప్రచారాన్ని ఒంటిచేత్తో నిర్వహించారు. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగిత ఇతరత్రా స్థానిక అంశాలనే ప్రచారాస్త్రాలుగా మంచి ఫలితాలు సాధించారు. విపక్ష కూటమిలో సైతం పైచేయి సాధించి, కాంగ్రెస్‌ను నాలుగో స్థానంలోకి నెట్టారు. ఈసారి ఎన్‌సీపీ 56 సీట్లు గెలిచి, తన బలాన్ని గతంలోకన్నా 15 సీట్లు పెంచుకుంది.
భూపీందర్‌సింగ్ హుడా...
హరియాణాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం భూపీందర్‌సింగ్ హుడా ఈ ఎన్నికలతో మరోసారి వార్తల్లో నిలిచారు. రాహుల్‌గాంధీ పక్కనపెట్టడంతో వెనకబడిన 72 ఏళ్ల హుడా, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ పదవీ బాధ్యతలు చేపట్టడంతో మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో పలు బాధ్యతల్ని చేపట్టారు. రాష్ట్రంలో తనకున్న పాత పరిచయాల్ని ఉపయోగించుకున్నారు. ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. చివరికి మెరుగైన ఫలితాలే సాధించారు.
ఇదీ చూడండి:గవర్నర్ వద్దకు వేర్వేరుగా భాజపా, శివసేన నేతలు- ఎందుకు?