కశ్మీర్‌లోని బుడ్గామ్ జిల్లాలో ఫిబ్రవరి 27న కూలిన భారత వాయుసేన హెలికాప్టర్ 'ఎంఐ-17వి-5' ప్రమాదానికి కారణాలను విచారణ కోర్టు వెల్లడించింది. 6 నెలలు కొనసాగిన ఈ దర్యాప్తులో ప్రమాదానికి కారణం అందులోని అధికారులదేనని తీర్పునిచ్చింది.
హెలికాప్టర్లో ఉన్నది శత్రువా, మిత్రుడా అని తెలిపే 'ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ ఫో' మీట ఉంటుంది. ఈ మీట ఆన్ చేసి ఉంటేనే ఛాపర్ ఎవరిదనేది రాడార్లు గుర్తిస్తాయి. దీనిని పైలట్ ఆన్ చేయకపోవడం వల్ల అది శత్రు దేశానికి చెందిన ఛాపర్ అనుకొని ఉపరితల మిస్సైల్ ద్వారా పేల్చివేశారు.
ఈ చర్యతో ఛాపర్‌లోని అధికారులు వాయుసేన నిబంధనలు ఉల్లంఘించారని కోర్టు పేర్కొంది.
పాక్ హెలికాప్టర్‌గా భావించి..
ఫిబ్రవరి 26న పాక్‌లోని బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వైమానిక దాడులు చేసింది భారత వాయుసేన. ఈ దాడి మరుసటి రోజైన ఫిబ్రవరి 27న ఉదయం 9.30 గంటల సమయంలో పాక్ వైమానిక దళం విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. పాక్ విమానాల్ని సమర్థంగా తిప్పికొట్టింది భారత వాయుసేన.
ఈ క్రమంలోనే ఉదయం 10.10 గంటలకు హెలికాప్టర్‌ను మన రాడార్లు గుర్తించాయి. ఛాపర్‌ను పాకిస్థాన్‌కు చెందినది భావించి ఉపరితల క్షిపణి ద్వారా క్షణాల్లో కూల్చేసింది.
శ్రీనగర్‌కు తిరిగి వెళుతుండగా..
పాక్ విమానాలు భారత్‌లోకి చొరబడిన సమయంలో వాటిని అడ్డుకునేందుకు శ్రీనగర్‌లో గాల్లోకి లేచింది ఈ హెలికాప్టర్. అయితే శ్రీనగర్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని ఛాపర్‌ను వెనక్కిపిలిచారు. ఈ సమయంలో గుర్తించిన ఉపరితల వైమానిక దళం హెలికాప్టర్‌ను నేలమట్టం చేసింది.
ఛాపర్‌ను స్క్వాడ్రన్ లీడర్ సిద్ధార్థ్ విశిష్ఠ్ నడిపారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న ఆరుగురు సైనికులు, ఓ పౌరుడు అక్కడిక్కడే మృతిచెందారు.
ఇదీ చూడండి: 13 ఏళ్ల వయసులోనే రూ.లక్ష దొంగతనం