దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ) వ్యతిరేక నిరసనలు రోజుకో కొత్త విధానంలో సాగుతున్నాయి. సీఏఏను వ్యతిరేకిస్తూ ఫుట్‌బాల్ మైదానంలో నినాదాలు, ఇంటి ముందు రంగవల్లులు, పాటలు, భారీ ర్యాలీలతో.. ఇలా ఎవరికి వారు తమదైన శైలిలో నిరసనలు చేపడుతున్నారు. అయితే, కర్ణాటక మంగళూరులో ఇంకాస్త వినూత్నంగా నిరసన తెలియజేశారు ఆందోళనకారులు. వందలాది మంది జాతీయ జెండాలు పట్టుకుని ఒకేసారి పడవల్లో ప్రయాణించి సీఏఏ వ్యతిరేక నిరసనలో పాల్గొన్నారు.
ఆద్యార్ షా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సీసీఏ వ్యతిరేక సభలో పాల్గొనేందుకు ఉల్లాల్ కోటెపురలోని నేత్రావతి నదీ ఒడ్డు నుంచి పడవల్లో బయల్దేరారు నిరసనకారలు. జాతీయ జెండాలు పట్టుకుని, 'ఆజాదీ..ఆజాదీ..' అంటూ నినాదాలు చేశారు. ఈ సీఏఏ వ్యతిరేక పడవ యాత్రలో భారీ సంఖ్యలో స్థానిక మత్స్యకారులు పాల్గొన్నారు.
రెండూ కలిసొచ్చాయి..
కోటెపురా నుంచి షా గ్రౌండ్స్‌కు సుమారు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళితే ట్రాఫిక్ కారణంగా 5 కి.మీ నడవాల్సి వస్తుంది. పడవల్లో అయితే.. షా గ్రౌండ్స్‌కు 500 మీటర్ల దూరంలోని ఒడ్డు వద్ద దిగుతారు. ఈ కారణంగా ఇలా పడవ మార్గాన్ని ఎంచుకున్నారు నిరసనకారులు. ఎలాగో పడవ ప్రయాణం చేస్తున్నారు కాబట్టి.. పడవల్లోనే సీఏఏ వ్యతిరేక నినాదాలు చేసి వినూత్నతను చాటుకున్నారు.
ఇదీ చదవండి:సంపాదన రూ.7 వేలు- కట్టాల్సిన ఆదాయ పన్ను రూ.350కోట్లు