దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా గర్భణీలు, తల్లులు, చిన్నారులు చాలా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారికి కావాల్సిన మెడికల్ వస్తువులను హోం డెలివరీ చేయాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత అధికారులకు సూచించింది కేంద్రం. కాంట్రాసెప్టివ్స్‌తో పాటు కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ వంటి ఔషదాలను అందించాలని తెలిపింది. లాక్డౌన్ కారణంగా వారు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ అత్యవసర సేవలను తిరస్కరించకూడదని తేల్చి చెప్పింది.
గర్భస్థ, నవజాత శిశువులు, చిన్నారుల చికిత్సకు సంబంధించిన మార్గ దర్శకాలను విడుదల చేసింది కేంద్రం. ఇటువంటి సంక్షోభ సమయంలో కరోనాతో సంబంధం లేకుండా.. వారికి ఆరోగ్య సేవలను అందించాలని సూచించింది. వారికి కావాల్సిన సేవల విషయంలో అలసత్వం వహించకూడదని స్పష్టం చేసింది.
లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నట్లైతే అదనపు సెషన్లు, క్లీనిక్‌లను ఉపయోగించుకోవచ్చని తెలిపిన కేంద్రం.. 5 నుంచి 10మంది మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వైద్యం అందించే ముందు, తర్వాత ఆ ప్రాంతాలను, ఉపయోగించిన పరికరాలను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలని పేర్కొంది.
కొవిడ్ అనుమానితులు, బాధితులకు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో చికిత్స అందించాలని స్పష్టం చేసింది. అవసరమైతే టెలి- కన్సల్టేషన్ సేవలను అందిపుచ్చుకోవాలని సూచించింది.
రోగనిరోధక టీకాలను అన్ని కరోనా చికిత్సా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని కేంద్రం పేర్కొంది. దీనితో పాటు ఈ టీకాలు.. కంటైన్మెంట్ జోన్ల వెలుపల, గ్రీన్ జోన్లలో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:ఏడేళ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స