దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుజరాత్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
ఒడిశాలో వరదలు...
ఒడిశా ధెన్కనల్ జిల్లాలో భారీ వర్షాలకు పలు మట్టి ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి.
ఛత్తీస్గఢ్ అతలాకుతలం...
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ వర్షాలకు పంటలు నీటమునిగాయి. బిజాపుర్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
బిహార్లో తగ్గని ఉద్ధృతి...
బిహార్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పర్యటించారు.
గుజరాత్ అస్తవ్యస్తం...
గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదరాలో విశ్వామిత్రనది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సూరత్లోని ఉధన ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. ద్వారక జిల్లాలో వరద నీటిలో ఇద్దరు గల్లంతయ్యారు.
మహారాష్ట్రలో రెడ్ అలర్ట్...
మహారాష్ట్రలోని పుణె, సతారా జిల్లాలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
- ఇదీ చూడండి: ఐదు రూపాయల డాక్టర్ ఇక లేరు