హాథ్రస్ అత్యాచార బాధితురాలి కుటుంబం సోమవారం అలహాబాద్ హైకోర్టులోని లఖ్‌నవూ బెంచ్ ముందు హాజరుకానుంది. బాధితురాలి మృతదేహానికి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారన్న విషయంపై కుటుంబ సభ్యులు తమ వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు.
"అక్టోబర్ 12న జరిగే విచారణలో ఎంత మంది పాల్గొంటారని అధికారులు మమ్మల్ని అడిగారు. లఖ్‌నవూకు వెళ్లేందుకు మాకు పూర్తి భద్రత కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మా నాన్న, అమ్మ, అక్క, సోదరుడితో పాటు నేను కూడా న్యాయస్థానం ముందు హాజరవుతాను."
-బాధితురాలి సోదరుడు
బాధిత కుటుంబ సభ్యులు కోర్టు ముందు హాజరై, వాంగ్మూలం ఇచ్చేలా చూడాలని హాథ్రస్ జిల్లా న్యాయమూర్తికి హైకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. అందకు అవసరమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించింది.
మీడియాకు దూరంగా
బాధిత కుటుంబ సభ్యులను మీడియాకు దూరంగా ఉంచుతామని లఖ్‌నవూకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. 'కుటుంబ సభ్యులను మీడియా ఇప్పటికే వేధింపులకు గురిచేసింది' అని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి అంతరాయాలు లేకుండా బాధితుల వాంగ్మూలం నమోదయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు.
అంత్యక్రియలపై సుమోటో
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌కు చెందిన 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరగ్గా.. రెండు వారాల తర్వాత బాధితురాలు మృతి చెందింది. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా పోలీసులు అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని లఖ్‌నవూ బెంచ్ సుమోటోగా తీసుకుంది. మరణించిన వ్యక్తి, బాధిత కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందా అనే విషయాన్ని పరిశీలించాలని అనుకుంటున్నట్లు కోర్టు పేర్కొంది.
ఈ విషయంపై స్పందించాలని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏడీజీ, హాథ్రస్ జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీని ఆదేశించింది. అదే సమయంలో.. ఘటనపై ఏ ప్రాతిపాదికన కథనాలు నివేదించారో కోర్టుకు వివరించాలని మీడియా సంస్థలను కోరింది.
సీబీఐ ఎఫ్ఐఆర్
ఈ అత్యాచార ఘటనపై దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సామూహిక హత్యాచారానికి సంబంధించిన సెక్షన్ల ప్రకారం నిందితులపై అభియోగాలు మోపింది.
"నిందితులు.. 14-09-2020న బాధితురాలి గొంతు నులిమారని ఫిర్యాదులో నమోదై ఉంది. భారత ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిపై దర్యాప్తు కోసం ఓ బృందాన్ని నియమించాం."
-ఆర్కే గౌర్, సీబీఐ ప్రతినిధి
ఈ కేసులో తొలుత హాథ్రస్ జిల్లా చాంద్పా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.