గుజరాత్‌లో సంక్రాంతిని ఉత్తరాయణ్ పేరుతో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల తరహాలోనే గుజరాత్‌లోనూ గాలిపటాలను ఎగరవేస్తారు. అక్కడ ఏటా అంతర్జాతీయ పతంగుల పండుగ కూడా నిర్వహిస్తుంటారు. ఈ పండుగతో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో పతంగులు తయారు చేసేవారికి బాగా గిరాకీ ఉంటుంది. కానీ... ఈ సారి ఆర్థిక మందగమనం ప్రభావం.. గాలి పటాల కొనుగోళ్లపై పడింది. ఏటా... ఈ సమయంలో జోరుగా నడిచే పతంగుల పరిశ్రమల పనులు ఈ ఏడాది నెమ్మదిగా సాగుతున్నాయి.
పతంగుల పండుగ..
ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఆహ్వానిస్తూ గుజరాత్‌లో చేసుకునే వేడుకను.. ఉత్తరాయణ్‌గా పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా గుజరాత్ అంతటా ఉత్సాహంగా గాలిపటాలు ఎగరేస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పతంగులను ఎగరేస్తూ సంబరాలు జరుపుకుంటారు. ఇరుగుపొరుగువారి మధ్య గాలిపటాల పోటీలు కూడా జరుగుతాయి. పక్కవాళ్ళ గాలిపటాలను తెంచేసి నేల కూల్చడానికి ఎత్తులూ పైయెత్తులూ ఉంటాయి. ఈ పండుగ సమయంలో గుజరాత్‌లోని నడియాడ్‌లో ఉన్న పతంగుల పరిశ్రమలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఎత్తుకు ఎగరని గాలిపటం..
నడియాడ్‌లో తయారైన గాలిపటాలు గుజరాత్ అంతా ఎగురుతాయి. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఉన్న నడియాడ్ నగరాన్ని పతంగుల పరిశ్రమలకు కేంద్రంగా పరిగణిస్తారు. ఈ నగరంలో 100 కర్మాగారాలుండగా, సుమారు 500 మంది హస్త కళాకారులు గాలిపటాలను తయారు చేస్తున్నారు. నడియాడ్‌లో తయారైన గాలిపటానికి గుజరాత్ అంతటా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఓ కళాకారుడు సగటున నిమిషానికి ఏడు గాలిపటాలను తయారు చేయగలడు.
నడియాడ్‌లో అనేక కుటుంబాలకు పతంగుల తయారే జీవనాధారం. 50 రూపాయల నుంచి పది రూపాయల వరకు అన్ని రకాల గాలిపటాలను ఇక్కడ రూపొందిస్తారు. ఈ పరిశ్రమల్లో రోజూ వేలాది గాలిపటాలు తయారవుతాయి. అయితే... దేశంలో ఉన్న ఆర్థిక మందగమనం ప్రభావం గాలిపటాల పరిశ్రమలపై కూడా కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి గాలిపటాల డిమాండ్ బాగా తగ్గిందని అందుకే పతంగుల తయారీ నెమ్మదించిందని స్థానిక వ్యాపారులు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, నష్టం వస్తుందని వారు వాపోతున్నారు.
ఇదీ చదవండి:దుష్ప్రచారం అర్థరహితం.. జనం కోసమే జనగణన.!