మానవ కంప్యూటర్‌గా ఖ్యాతి గడించిన భారతీయ గణిత మేధావి దివంగత శకుంతలా దేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాల 'ఫాస్టెస్ట్ హ్యూమన్ కంప్యూటేషన్'గా ఆమెను సత్కరించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు శకుంతలా దేవి కుమార్తె అనుపమ బెనర్జీ.
1980 జూన్ 18న లండన్‌లోని ఇంపీరియల్ కళాశాలలో శకుంతలా దేవి ఇచ్చిన అద్భుత ప్రదర్శనే ఆమెను ఈ స్థాయికి చేర్చింది. అదే రోజే ఆమె ప్రపంచానికి హ్యూమన్ కంప్యూటర్‌గా పరిచయమయ్యారు. 13 అంకెలు కలిగిన వివిధ సంఖ్యలను గుణంచి కేవలం 28 సెకండ్లలో సమాధానమిచ్చారు శకుంతలా దేవి.
వెండి తెరపై..
శకుంతలా దేవి మరణించిన ఏడేళ్ల తర్వాత వెండితెరపై ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా వస్తోంది. ఆమె పాత్రలో ప్రముఖ నటి విద్యాబాలన్ కనిపించనున్నారు. 'శకుంతలా దేవి' పేరుతో అను మేనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలవ్వగా.. ఇందులో బాల్యం నుంచి ఆమె ఎదిగిన క్రమాన్ని ఆవిష్కరించారు. శకుంతలాదేవి కుమార్తె(అనుపమ బెనర్జీ) పాత్రలో బాలీవుడ్ నాయిక సన్యా మల్హోత్ర కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జులై 31న(శుక్రవారం) విడుదల కానుంది.
ఇదీ చదవండి: 'ఆవు పేడ రాఖీ'లతో స్వదేశీ రక్షా బంధన్!