సరైన ప్రణాళిక లేకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది మంది వలస కార్మికల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎంతోమంది కూలీలు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తూ రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల ఆకలి కేకలకు ప్రధాని మోదీదే బాధ్యత అని పేర్కొన్నారు రాహుల్. పరిస్థితి మరింత విచారకరం అవకముందే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి వలస కూలీలు తమ సొంత ఊళ్లకు చేరుకునే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
ఎంతో మంది కార్మికులు తమ సొంతూళ్లకు చేరుకునేందుకు రోడ్డుపై వాహనాల కోసం ఎదురు చూస్తున్న వీడియోను జతచేసి ట్వీట్ చేశారు రాహుల్.
" ఉపాధి లేక, భవిష్యత్‌పై అనిశ్చితితో దేశవ్యాప్తంగా లక్షలాది మంది సోదర, సోదరీమణులు సొంత ఊళ్లకు చేరేందుకు అవస్థలు పడుతున్నారు. దేశ పౌరుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు. ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు లేవు."
-రాహుల్ గాంధీ, ట్వీట్.
ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికులకు ఆహారం అందించి ఆదుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ.
అఖిలపక్ష భేటీకి డిమాండ్
కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్. రాజకీయాలకు అతీతంగా అన్నీ పార్టీలు కలిసికట్టుగా కరోనాపై పోరాడలన్నారు. ప్రకృతి వివత్తు సంభవించినప్పుడల్లా అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు అజయ్. మజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి సీనియర్ నేతల సూచనలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.
ముందుగా చెప్పాల్సింది..
దక్షిణాఫ్రికాలో కరోనా నియంత్రణకు 21 రోజులు లాక్డౌన్ విధిస్తామని మూడు రోజుల ముందుగానే ప్రభుత్వం ప్రజలకు చెప్పిందని.. మోదీ ప్రభుత్వం ఇక్కడ అలా ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు అజయ్ మాకెన్. వలస కూలీలకు తక్షణమే సాయం అందించాలని డిమాండ్ చేశారు. వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.7,500 బదిలీ చేసి ఆర్థిక సాయం అందించాలన్నారు.
కేజ్రీవాల్‌పై భాజపా విమర్శలు..
వేలాది మంది వలస కార్మికులు దేశ రాజధాని దిల్లీని వీడేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే కారణమని భాజపా విమర్శించింది. కరోనాపై దేశమంతా కలిసి పోరాడుతుంటే కొందరు మాత్రం విఫలం చేయాలని చూస్తున్నారని ఆ పార్టీ నేత బీఎల్ సంతోష్ ఆరోపించారు. దిల్లీలో 100కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో లక్షలమంది వలస కార్మికులకు ఆశ్రయం కల్పించకుండా, వెళ్లేలా చేయడం దారణమన్నారు.