దేశంలో భారీగా పెరిగిపోయిన ఉల్లి ధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి ఉల్లి సరఫరాను పెంచి దేశీయంగా సప్లైకు ఊతమిచ్చేందుకు ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు దిగుమతి నిబంధనలను సడలించింది. ఉల్లి ధరలను అదుపు చేసేందుకు తమ వద్ద ఉన్న బఫర్ నిల్వల నుంచి మరింత సరకును తీసుకోనున్నట్లు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగైన 37లక్షల టన్నుల ఉల్లి.. మండీలకు రావడం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. దాని వల్ల పెరిగిన ధరల నుంచి ఊరట లభిస్తుందని స్పష్టం చేసింది. భారత్‌లోకి ఉల్లి దిగుమతులను పెంచేందుకు వివిధ దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాలు అక్కడి వ్యాపారులతో సంప్రదింపులు జరపాలని కేంద్రం పేర్కొంది.
వర్షాలు, వరదల కారణంగా పంట దిగుబడి తగ్గి దేశంలోని పలు చోట్ల కిలో ఉల్లి ధర రూ.100 వరకు చేరింది.
ఇదీ చూడండి: కన్నీరు పెట్టిస్తోన్న ఉల్లి- కిలోకు రూ.100కుపైనే..