వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఆర్ఓఈ(రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్)లో భారీ మార్పులు చేసింది భారత్. దీని ప్రకారం.. అసాధారణ పరిస్థితుల్లో సైనికులు కాల్పులు జరిపే విధంగా కమాండర్లు వారికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వొచ్చు. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనాతో జరిగిన భీకర పోరులో 20మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది భారత్.
తుపాకులు ఉన్నా...
గల్వాన్ లోయలో పక్కా ప్రణాళికతో చైనీయులు భారత జవాన్లపై దాడికి తెగబడ్డారు. సైనికులు తేరుకునే లోపే నష్టం జరిగిపోయింది. అయితే ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లోనూ భారత జవాన్లు తమ దగ్గర అయుధాలు ఉన్నా ఉపయోగించలేదు. చైనాతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తుపాకులను వాడకూడదన్న సీనియర్ల ఆదేశాలే ఇందుకు కారణం. ఫలితంగా 20మంది సైనికులు అమరులయ్యారు.
గల్వాన్ లోయలో గస్తీ విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల వద్ద ఆయుధాలు లేవా అని విపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా స్పందించారు.
"సరిహద్దులో విధులు నిర్వహించే జవాన్ల వద్ద ఆయుధాలు కచ్చితంగా ఉంటాయి. ఈ నెల 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ సమయంలోనూ మన సైనికుల వద్ద తుపాకులు ఉన్నాయి. కానీ ఎన్నో ఏళ్లుగా వస్తున్న అలవాటు ప్రకారం జవాన్లు వాటిని ఉపయోగించలేదు."
--- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి.
ఈ ఘటన అనంతరం ఆర్ఓఈలో మార్పులు చేసింది ప్రభుత్వం. దీని ప్రకారం ఎల్ఓసీ వెంబడి ఉండే కమాండర్లు.. ఇకపై అసాధారణ పరిస్థితుల్లో స్పందించేందుకు తమ సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వొచ్చు. ఇందుకోసం అన్ని వనరులను ఉపయోగించుకోవచ్చు. తుపాకులను వాడొచ్చు.
ఇదీ చూడండి- ఆపరేషన్ కశ్మీర్: ముగ్గురు ముష్కరులు హతం