మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో గూడ్స్ రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొంది శివసేన. ఈ మేరకు అధికారిక పత్రిక సామ్నా.. సంపాదకీయంలో కథనాన్ని ప్రచురించింది. దేశంలో కూలీల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే.. ఈ విమర్శలు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వపైనా లేకా సేన-నేతృత్వంలోని మహరాష్ట్ర ప్రభుత్వంపైనా అనేది స్పష్టంగా చెప్పలేదు.
" వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించడంపై ప్రభుత్వాధికారులు ఆలోచన చేయలేదు. ఇక్కడ చిక్కుకుపోయిన వారికి ఆహారం అందిచటంపైనా దృష్టి పెట్టలేదు. లాక్డౌన్ విధించే ముందే పేదలకు ఎదురయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకోవాల్సింది. కూలీల నెత్తురుతో తడిసిన ప్రాంతంలో రొట్టెలు పడి ఉండటం.. హృదయం ద్రవించింది. ఈ ఘటన వాస్తవికతను సూచిస్తోంది. ఎలాంటి అనారోగ్యం, కరోనా లక్షణాలు లేకపోయిన ఆ కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వారి మరణానికి బాధ్యత ప్రభుత్వానిదే. లాక్డౌన్ అనేది ప్రజలు కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండేందుకు అమలు చేశారు. కానీ.. లాక్డౌన్ కారణంగా కూలీలు ఆకలితో మరణించారు."
- సామ్నా సంపాదకీయం
కరోనా బాధితులే..
వలస కూలీలు ఎదుర్కొంటున్న పరిస్థితి మహారాష్ట్రకే పరిమితం కాదని.. దేశవ్యాప్తంగా ఉందని పేర్కొంది సామ్నా. పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడటం వల్ల కూలీలు వారి సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్నా రవాణా సౌకర్యం లేదని.. చిన్న పిల్లల్ని చంకన పెట్టుకని కూలీలు కాలినడకన తరలివెళ్తుంటే ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందని ఎద్దేవా చేసింది. ఓ తల్లి ఒక చేతిలో మూట, ఒక చేతిలో చిన్న పిల్లను పట్టుకుని 1600 కిలోమీటర్లు నడిచి వెళ్లడం బాధాకరం.. దేశంలో కూలీల పరిస్థితి ఈ విధంగా ఉండటం సిగ్గుచేటు అని ఘాటు విమర్శలు చేసింది శివసేన.