దేశ రాజధాని దిల్లీలో రైతుల నిరసనలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఈ తరుణంలో హరియాణాలోని వ్యవసాయ నిపుణులు జేఎస్ టూర్‌ను ఈటీవీ-భారత్ సంప్రదించింది. రైతులు కన్నెర్ర చేసిన నూతన వ్యవసాయ చట్టాలపై టూర్‌తో చర్చించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
'డబ్ల్యూటీఓతో భారత్ ఒప్పందం..'
నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకొచ్చింది. అందుకు ముందుగానే.. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏ దేశం కూడా తమ రైతుల ఉత్పత్తులో 10శాతం మించి కొనుగోలు చేయకూడదని ఆ ఒప్పందం సూచిస్తోంది. ఇందుకు అనుగుణంగానే కేంద్రం ఈ నూతన సాగు చట్టాలను తీసుకొచ్చింది.
'ప్రైవేటు వ్యక్తుల ఇష్టారాజ్యమే'
నూతన చట్టాల్లో కనీస మద్దతు ధర ప్రస్తావనే లేదు. ఇందువల్ల ప్రైవేటు వ్యక్తులు మార్కెట్లోకి వస్తారు. తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తారు.
ఇదీ చూడండి- కర్షక పోరు: ఈ ఐదు ప్రశ్నలకు బదులేది?
'ఎఫ్‌సీఐకి స్వస్తి'
దేశంలో రైతుల పంటలను కొనుగోలు చేసే వాటిని నిల్వ ఉంచేందుకు ఎఫ్‌సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కొత్త చట్టాల్లో ఎఫ్‌సీఐ, ప్రభుత్వ ఏజెన్సీలను చేర్చలేదు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే ఎఫ్‌సీఐకి ప్రభుత్వం స్వస్తి పలుకుతుందేమో! అదే జరిగితే పంట ధరలు చాలా ప్రభావితమవుతాయి.
తమ పంటలను అమ్ముకునేందుకు రైతులు ఇతర రాష్ట్రాలకు ఎలా వెళ్లగలరు? రవాణాకు వారి వద్ద సదుపాయాలు ఉండవు. కనీస మద్దతు ధరను ప్రభుత్వం చట్టాల్లో చేర్చాలి. అంతేకానీ నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకోవడం సరికాదు.
ఇదీ చూడండి:- కొత్త వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు ముప్పు