గోవా నూతన ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ పేరును భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. పనాజీలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో గోవా భాజపా శాసనసభాపక్షం సమావేశమైంది. ప్రమోద్ సావంత్‌ను ఏకగ్రీవంగా నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది.
గోవా ఫార్వర్డ్ పార్టీ అధినేత విజయ్ సర్దేశాయ్, మహారాష్ట్రవాదీ గోమంటక్ పార్టీ నేత సుదిన్ ధావలికర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. ప్రమోద్ సావంత్‌కు మద్దతుగా ఇప్పటికే గోవా ఫార్వర్డ్ పార్టీ, ఎమ్జీపీ సహా ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు లేఖలు సమర్పించారు.
రాజకీయ రగడ
ఆదివారం మనోహర్ పారికర్ మరణిచడం వల్ల గోవా ముఖ్యమంత్రి పీఠం ఖాళీ అయింది. దీంతో రాష్ట్రంలో పెద్ద పార్టీగా ఉన్న తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ గవర్నర్‌ను కోరింది. దీంతో అప్రమత్తమైన భాజపా ప్రస్తుతం గోవా శాసన సభ స్పీకర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రమోద్ సావంత్‌ను నూతన ముఖ్యమంత్రిగా ఖరారు చేసింది.
ఈ నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది. భాజపా కృత్రిమ మెజారిటీ చూపిస్తోందంటూ ఆరోపిస్తోంది. ప్రస్తుతం భాజపాకు 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిత్రపక్షాలతో కలిపి ఆ సంఖ్య 20గా ఉంది. 14మంది శాసన సభ్యులతో అసెంబ్లీలో కాంగ్రెస్ అతిపెద్దపార్టీగా కొనసాగుతోంది.