మనోహర్ పారికర్ మరణంతో గోవా రాజకీయం వేడెక్కింది. నూతన ముఖ్యమంత్రి ఎంపికపై భాజపా కసరత్తు ముమ్మరం చేసింది. గోవా భాజపా, దాని భాగస్వామ్య పార్టీ మహరాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) నాయకులతో సమావేశమయ్యారు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ముఖ్యమంత్రి ఎంపికపై సుధీర్గంగా చర్చలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు నూతన ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తామని, 3 గంటలకు ప్రమాణస్వీకారం జరుగుతుందని గోవా భాజపా పార్టీ అధ్యక్షుడు తెలిపారు.
ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని భావిస్తున్న భాజపా ఎమ్మెల్యే విశ్వజిత్ రానే, ఎంజీపీ నాయకుడు సుదిన్ ధవలికర్లు సమావేశానికి హాజరయ్యారు. గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) పార్టీకి ఆహ్వానం అందలేదు.
ఆదివారమే తదుపరి ముఖ్యమంత్రిపై భాజపా నేతృత్వంలోని కూటమి కసరత్తు ప్రారంభించింది. భాజపా, జీఎఫ్‌పీ, ఎంజీపీ కూటమితో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైంది.
40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ 14 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉంది. భాజపాకు 12 మంది సభ్యులు ఉన్నారు.
కేంద్ర మంత్రివర్గం సతాపం...
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతికి కేంద్ర మంత్రివర్గం సంతాపం ప్రకటించింది. పారికర్ నిరాడంభరత, అసాధారణ సేవలు గుర్తుండిపోతాయని పేర్కొంది.
రెండు నిమిషాల పాటు మౌనం పాటించి పారికర్‌కు నివాళులర్పించారు మంత్రులు. పారికర్ మృతిపై చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపారు . సామాన్యుల ముఖ్యమంత్రిగా పిలుచుకునే సమర్థవతంమైన నాయకుడిని దేశం కోల్పోయిందని తీర్మానంలో పేర్కొన్నారు.