ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి(74) ఆరోగ్యం విషమించిందని, ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నామని మంగళవారం వెల్లడించారు వైద్యులు. నాడీ వ్యవస్థ పనితీరు పూర్తిగా పడిపోయిందని, ఆయన కోమాలోనే ఉన్నారని తెలిపారు. గుండెనొప్పి, శ్వాస సంబంధ సమస్యలతో మే 9న జోగి రాయ్‌పూర్‌లోని శ్రీ నారాయణ ఆసుపత్రిలో చేరారు.
" జోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు. ఆయన నాడీ వ్యవస్థ పనితీరు పూర్తిగా నిలిచిపోయింది. మెదడు పనితీరును మెరుగుపరచడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇయర్ ఫోన్స్ ద్వారా ఆయనకు ఇష్టమైన పాటలు వినిపిస్తున్నాం. కానీ ఇంతవరకు ఏ ప్రయోజనం లేదు. గుండె పనితీరు, బీపీ అంతా సరిగానే ఉంది"
--డాక్టర్ సునీల్ ఖేమ్కా, ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్
ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసిన జోగి 1986లో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో, ప్రభుత్వంలో పలు కీలక పదవులు చేపట్టారు. 2000 నుంచి 2003 మధ్య ఛత్తీస్‌గఢ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ పార్టీ స్థాపించారు. ఆయన కుమారుడు అమిత్ జోగి ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు.