అంతా అనుకున్నట్లే జరిగింది. ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకున్న బిహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే జనతా దళ్(యునైటెడ్) తీర్థం పుచుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను పట్నాలోని ఆయన నివాసంలో కలిసిన పాండే.. పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన సీఎం కోరిక మేరకే జేడీయూలోకి వెళ్లానని స్పష్టం చేశారు.
![Former Bihar DGP Gupteshwar Pandey, who recently took VRS, joins JD(U)](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8959314_1.jpg)
''సీఎం పిలిచి పార్టీలో చేరమని అడిగారు. పార్టీ ఏం చెప్పినా చేసేందుకు నేను సిద్ధం. రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు. నేనో సాధారణ వ్యక్తిని మాత్రమే.''
- గుప్తేశ్వర్ పాండే, బిహార్ మాజీ డీజీపీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ డీజీపీ నిర్ణయం ఆసక్తి రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 23న ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తొలుత ఊహాగానాలొచ్చాయి.
వీఆర్ఎస్కు ముందు సుశాంత్ కేసును దర్యాప్తు చేసిన పాండే.. మహారాష్ట్ర పోలీసులు సహకరించలేదని ఆరోపించారు.
ఇదీ చూడండి: బిహార్ డీజీపీ వీఆర్ఎస్- అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ!
అయితే.. శనివారం ముఖ్యమంత్రిని కలిసిన ఆయన.. రాజకీయాల్లో చేరడం లేదని చెప్పడం గమనార్హం. కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని మీడియాకు చెప్పారు.
3 దశల్లో పోలింగ్...
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు (అక్టోబరు 28, నవంబరు 3, 7) నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బిహార్ శాసనసభ కాలపరిమితి నవంబరు 29తో ముగియనుంది.