గురువారం జరిగిన తొలిదశ సార్వత్రిక ఎన్నికల్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు చేస్తే... మరికొన్ని కేంద్రాల్లో పోలింగ్ మందకొడిగా సాగింది. కానీ ఒడిశాలోని 15 కేంద్రాల్లో మాత్రం సున్నా ఓటింగ్ శాతం నమోదైంది.
ఒడిశాలోని మాల్కాన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ, మథిలిల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఒక్క ఓటూ పడలేదు. మావోయిస్టుల భయంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అధికారులు తగిన చర్యలు చేపట్టినప్పటికీ ఓటు వేయడానికి ప్రజలు ముందుకు రాలేదు.
ఎన్నికల బహిష్కరణ
ఒడిశాలోని కలాహండీ జిల్లా బెజీపదార్ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామానికి కనీస సదుపాయాలు కల్పించకపోవటం వల్లే ఓటు వేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పట్టించుకునే వారు లేరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.