అంపన్ అతి తీవ్ర తుపాను భీకరగాలులతో బంగాల్ తీరాన్ని తాకింది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు తీరాన్ని దాటే ప్రక్రియ మొదలైనట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. ఇది సాయంత్రం 6.30 వరకు కొనసాగనుంది. బంగాల్-బంగ్లాదేశ్ మధ్య సుందర్బన్ సమీపంలోని హతియా దీవుల వద్ద తుపాను తీరం దాటుతుందని అంచనా.
భారీ వర్షాలు..
తుపాను తీరాన్ని తాకడం వల్ల పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి ఒడిశా, బంగాల్ సముద్రతీర ప్రాంతాలు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలోని పూరీ, ఖుర్దా, జగత్‌సింగ్‌పూర్ సహా బాలేశ్వర్ జిల్లా, కటక్, కేంద్రపాడా, జాజ్‌పుర్, గంజాం, భద్రక్‌లో భారీవర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భారత నావికా దళం, 41 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొహరించారు. గాలింపు, సహాయక చర్యలు చేపట్టడానికి నావికా దళానికి చెందిన నౌకలు, విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఆహార పొట్లాలు, దుస్తులు తదితర వస్తువులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు నావికా దళం పేర్కొంది.
బంగ్లాదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారనున్న అంపన్... ఆ తర్వాత బలహీనపడనుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.