ఒడిశా కంధమల్ జిల్లాలో నదిని దాటేందుకు 30 ఏళ్లుగా ప్రాణాలు పణంగా పెడుతున్నారు ఓ ఊరి ప్రజలు. కరెంటు తీగలపై నడుస్తూ ఓ ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరుతున్నారు.
కంధమల్ జిల్లా ఫుల్బానీ తాలూకా, గుంజిబాడి గ్రామ పంచాయతీలోని బిరిందాపడా ఓ గిరిజన గ్రామం. ఆ ఊరి నుంచి పట్టణాలకు వెళ్లాలంటే నదిని దాటడమే ఏకైక మార్గం. అందుకోసం, నాలుగు కరెంటు వైర్లను ఇరువైపులా చెట్లకు కట్టి ఓ ఆధారం నిర్మించుకున్నారు. చిన్నా, పెద్దా తేడాలేకుండా ఎవ్వరైనా సరే ఓ ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరాలంటే ఆ తీగలపై సాహసం చేయాలి. కాలు కాస్త అటు, ఇటు అయినా.. అంతే సంగతులు.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు దాదాపు, 30 ఏళ్లుగా బిరిందాపడా గ్రామస్థులు ప్రమాదంలో యాత్రలు చేస్తున్నారు. మూటలు మోస్తూ, పిల్లలను భుజాన ఎత్తుకుని విన్యాసాలు చేస్తున్నారు. అయితే, ఆ మార్గంలో ఓ వంతెన నిర్మించమని అధికారులను కోరితే.. దానికి మరో వైపు ఓ వంతెన నిర్మించారు. కానీ, ఆ వంతెన దాటాలంటే మరో 6 కిలోమీటర్లు అదనంగా నడవాల్సిందే.
అందుకే, సమయాన్ని ఆదా చేయడానికి ఈ కరెంటు తీగలపై నడిచేందుకే సిద్ధపడుతున్నారు గ్రామస్థులు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకుని ఇకనైనా సమీపంలో దృఢమైన వంతెన నిర్మించాలని వేడుకొంటున్నారు.
ఇదీ చదవండి: భారత నేలలో ఇండోనేసియా నీలి వరిపైరు!