అవినీతి అంతానికి పంతం పట్టినట్లు అందరూ చెబుతున్నా వాస్తవంలో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని సర్వోన్నత న్యాయపాలిక లోగడ నిష్ఠురసత్యం పలికింది. పౌరులకు నేరుగా సేవలందించాల్సిన పలు సర్కారీ విభాగాల్లో అవినీతి అంతెత్తున మేట వేసిందని, నరికినా తిరిగి మొలుచుకొచ్చే రావణాసురుడి తలల్లా అది చిరాయువై వర్ధిల్లుతోందని ఎన్నెన్నో అధ్యయనాలు ఎలుగెత్తుతున్నాయి.
అన్ని శాఖల్లోనూ..
తెలంగాణలో అవినీతి మోతుబరులకు అరదండాలు వెయ్యడంలో అనిశా (ఏసీబీ) ఈసారి 173 కేసులతో కొత్త రికార్డు సృష్టిస్తే- వరసగా మూడేళ్లు అగ్రస్థానంలో కొనసాగి రెవిన్యూ విభాగం స్వీయ‘ప్రతిష్ఠ’ ఏ మాత్రం మసకబారిపోకుండా కాచుకొంది. ఏకగవాక్ష విధానంలో అవినీతికి తావులేకుండా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నా, రెవిన్యూ సిబ్బంది జలగల్లా జుర్రేస్తున్నారన్న నిఘా విభాగం మొత్తుకోళ్లు- వ్యవస్థీకృతమైపోయిన లంచాల మేతకు తిరుగులేని ఆనవాళ్లు! ఏడాది మొత్తం 173 కేసుల్ని అనిశా నమోదు చెయ్యగలిగితే, అందులో రెవిన్యూను వెన్నంటి పురపాలక, హోం, వైద్యం, ఇంధనం, పంచాయతీరాజ్, న్యాయ, విద్య, నీటిపారుదల, రవాణా, వ్యవసాయం వంటి విభాగాలు ఉండటం- స్థాయీభేదాలతో సర్కారీ శాఖలన్నీ అవినీతి అడుసులో ఈదులాడుతున్నాయనడానికి రుజువులు!
పట్టుబడ్డా బుద్ధి మారదా?
లంచం తీసుకొంటూ అనిశాకు చిక్కిన విద్యుత్ శాఖ ఇంజినీర్లు ఆరు నెలలు తిరగకముందే దర్జాగా విధుల్లో చేరిపోతున్నారని, పదోన్నతులూ పొంది ప్రాధాన్య పోస్టుల్లో చక్రం తిప్పుతూ యథాపూర్వం వసూళ్లకు పాల్పడుతున్నారని వార్తాకథనాలు చాటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో అవినీతి రెండంకెల్లో ఉందని లోగడ అక్కడి సర్కారే నిర్ధారించింది. లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా సుపరిపాలనకు నాందీవాచకం పలకాలన్న ఏలికల లక్ష్యాలకు అడుగడుగునా తూట్లుపడి, కోరినంత ముట్టజెప్పకుంటే కొర్రీలతో దస్త్రాలను అటకెక్కించే జాడ్యం అన్నిచోట్లా ప్రబలిపోతున్న వైనం- ప్రజాస్వామ్య పాలనా సంవిధాన పునాదుల్నే దెబ్బతీస్తోంది. ప్రజల కోసం పాలన కాస్తా ప్రజలకు అనునిత్యం పీడనగా పరిణమించడం కంటే దురదృష్టం ఏముంటుంది?
డబ్బులిచ్చి ఉద్యోగాలు కొనుక్కోవడం, అంతకు ఎన్నెన్నో రెట్లు కూడబెట్టడానికి నానాగడ్డి కరవడం- ఇదో విషవలయం. ఎనిమిది మంది ముంబయి పోలీసులు, అయిదుగురు కస్టమ్స్ అధికారులు డబ్బుకు కక్కుర్తి పడకపోతే 1993లో ముంబయి వరస బాంబు దాడుల ఘోరం జరిగి ఉండేదేకాదని ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. సర్కారీ వైద్యశాలలో భార్యను ప్రసవానికి చేర్చిన అభాగ్యుడు అక్కడి సిబ్బందికి లంచాలు మేపలేక రెండేళ్ల కూతురితో పాటు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్న అమానుషం నాలుగేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌లో నమోదైంది.
కళ్లుగప్పే అవినీతి తంత్రాలు
సర్కారీ కార్యాలయాల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచి, సీసీ టీవీ కెమెరాలు అమర్చి అవినీతిని అదుపు చెయ్యాలనుకొన్నా- వాటికీ విరుగుడు మంత్రాలతో అవినీతి తంత్రం రాజ్యమేలుతోంది. నెల రోజుల నాడు వెలుగుచూసిన ‘ఇండియా కరప్షన్ సర్వే-2019’ నివేదిక దేశవ్యాప్తంగా అవినీతి ఉరవడిలో రాజస్థాన్‌కు తొలిస్థానం కట్టబెట్టగా బిహార్, యూపీ, ఝార్ఖండ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తరవాతి స్థానాల్లో, ఏపీ 13వ స్థానంలో నిలిచాయి.
ధనరూపంలోనే లంచాల మేత సాగుతోందని 35 శాతం, కంప్యూటరీకరణ జరిగిన కార్యాలయాల్లోనే డబ్బు చేతులు మారిందని 44శాతం, సీసీటీవీ వ్యవస్థ ఉన్నా లంచాల దారి లంచాలదేనని 16శాతం చెప్పడం; పెద్ద చేపలు పట్టుబడినప్పుడల్లా పదులు, వందల కోట్ల సంపద బయటపడటం నిర్ఘాంతపరుస్తోంది. బాధ్యతలు చేపట్టే సమయంలో ఉద్యోగి ఆస్తిపాస్తులు ఏమిటి, ఏటికేడు వాటి పెరుగుదల ఏ తీరుగా ఉందో ఆరాతీసే యంత్రాంగాలు పటిష్ఠంగా ఉంటే, అవినీతి మేతగాళ్లకు బెదురు పుడుతుంది. అత్యంత అమానుషంగా సాగే మానవ హక్కుల ఉల్లంఘనకు మరో పేరు- అవినీతి. దాన్ని మట్టగించకుండా దేశానికి ప్రగతేది, సుగతేదీ?
తల్లివేరు అదే..
చెదపురుగు లాంటి అవినీతిని మట్టుబెట్టాలంటే, ప్రభుత్వపరంగాను, వ్యక్తిస్థాయిలోనూ సంఘటితంగా స్థిరమైన కృషి సాగాల్సి ఉందని ప్రధాని మోదీ ఇటీవలి స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట సందేశంలో పేర్కొన్నారు. అన్ని రకాల అవినీతికీ రాజకీయ అవినీతే తల్లివేరు! ప్రక్షాళన క్రతువు అక్కడ మొదలు కానంతవరకు అవినీతి అధికారుల ఏరివేతలు ఏ స్థాయిలో జరిగినా వాటివల్ల ప్రయోజనం పెద్దగా ఒనగూడదు.
కేంద్రప్రభుత్వ పరిధిలోని 600కు పైగా ఉన్న స్వయంప్రతిపత్తి సంస్థల్లో కొరగాని, అవినీతి అధికారుల ఏరివేత సమీక్ష జరగాలని ఆదేశించిన మోదీ ప్రభుత్వం- ఇటీవలే అయిదు విడతలుగా పన్నుల విభాగంలోని 85మంది ఉన్నతాధికారులకు ఉద్వాసన పలికింది. దేశ రాజధాని దిల్లీలో గల మూడు కార్పొరేషన్లలో అవినీతి చెత్త ఊడ్చేయాలంటే- పౌరసేవలకు సిబ్బంది కరవు తప్పదనేంతగా పరిస్థితి విషమించింది. ఉత్తర దిల్లీ కార్పొరేషన్లో 230 మంది ఇంజినీర్లు ఉంటే నేరాభియోగాలు లేనివాళ్లు 17 మంది!
పోరాటం అవసరం..
బృహన్ ముంబయి కార్పొరేషన్లో 80 శాతం సిబ్బందిపై లంచాల మేత ఆరోపణలున్నాయి. వ్యవస్థ ఇంతగా పుచ్చిపోబట్టే- 2015లో ప్రపంచ అవినీతి సూచీలో 76వ స్థానంలో ఉన్న ఇండియా 2017లో 81వ స్థానానికి దిగజారి, నిరుడు 78కి చేరుకొంది. భారత రాష్ట్రపతిగా కేఆర్ నారాయణన్ చెప్పినట్లు- అవినీతికి వ్యతిరేకంగా మరో స్వాతంత్య్ర పోరాటం సాగించాల్సిన అవసరం కళ్లకు కడుతోంది. రాజకీయ అవినీతి కుంభస్థలాన్ని బద్దలుకొడితే, దాని దన్నుతో ఎదుగుతున్న శక్తులన్నీ ఒక్కపెట్టున కుప్పకూలుతాయి. వర్తమానంతోపాటు భవిష్యత్తుకూ చితిపేరుస్తున్న అవినీతిపై ప్రధాని మోదీ చెప్పినట్లు- అందరొక్కటై మోగించాలి సమరభేరి!