బంగాళాదుంపలు మట్టిలో పెరగడం సహజం. కానీ కేవలం గాలిలో బంగాళదుంపలను పండించటం మీరెప్పుడైనా చూశారా? హరియాణా కర్నాల్ జిల్లాలో ఇది సాధ్యం. అక్కడి 'బంగాళదుంప సాంకేతిక కేంద్రం'లో గాలితో ఆలుగడ్డలను పండిస్తున్నారు. పైగా వీటి దిగుబడి సాధారణంగా పండించే వాటి కన్నా 10 నుంచి 12 రెట్లు అధికం. 2020 చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఎయిరోపోనిక్ సాంకేతికత
గాలితో బంగాళ దుంపను పండించే ఈ అధునాతన సాంకేతికతను 'ఎయిరోపోనిక్'గా పిలుస్తారు. మట్టి అవసరం లేకుండా ఓ ప్లాస్టిక్ లేదా థర్మాకోల్ డబ్బాలో మొక్కలను ఉంచుతారు. వీటిని గాల్లో వేలాడదీస్తారు. అవసరం మేరకు నీరు, గాలి, పోషకాలను అందిస్తారు. దీని ద్వారా వేర్లు పెరుగుతాయి. వేర్లు పెరిగే కొద్ది చిన్న పరిణామంలో బంగాళదుంపలు పెరుగుతుంటాయి. వీటి ద్వారానే విత్తనాలను ఉత్పత్తి చేస్తారు.
'బంగాళదుంప సాంకేతిక కేంద్రం' హరియాణాలోని కర్నాల్ జిల్లా శామ్గఢ్ గ్రామంలో ఉంది. అంతర్జాతీయ బంగాళదుంప కేంద్రంతో దీనికి ఒప్పందం ఉందని.. ప్రభుత్వ అంగీకారంతోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు అధికారి నిశా సోలంకి తెలిపారు.
ఇంతకుముందు వరకు గ్రీన్ హౌజ్ సాంకేతికతతో బంగాళదుంప విత్తనాలను ఉత్పత్తి చేసేవాళ్లమని.. వాటి దిగుబడి చాలా తక్కువగా ఉండేదని సోలంకి చెప్పారు. గతంలో ఒక్కో మొక్కకు 5 బంగాళదుంపలు దిగుబడి వస్తే ప్రస్తుత సాంకేతికతతో 10 కిపైగా బంగాళ దుంపలు పండించవచ్చని వివరించారు. ఈ పద్ధతి ద్వారా విత్తనాలను ఉత్పత్తి చేస్తే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు సోలంకి.