ఎన్సీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. యూపీఏ హయాం నాటి ఎయిర్ ఇండియా కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 6న విచారణకు హాజరవ్వాలని పటేల్‌ను ఆదేశించింది ఈడీ.
ఏంటీ కుంభకోణం..?
లాభాలు వచ్చే రూట్లు, సమయాల్లో ఎయిర్ ఇండియా విమానాలు తిప్పకుండా చేయడం ద్వారా విదేశీ ప్రైవేటు విమానయాన సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరేలా చేశారన్నది ప్రధాన అభియోగం. ఇందుకు ప్రతిఫలంగా పౌర విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా అధికారులకు ముడుపులు అందాయన్నది ఆరోపణ. ఆ సమయంలో ప్రఫుల్ పటేల్ పౌరవిమానయాన శాఖ మంత్రి.
ఎయిర్ ఇండియాకు తీవ్ర నష్టం మిగిల్చిన ఈ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. విమానయాన రంగ మధ్యవర్తి దీపక్ తల్వార్‌ను ఈ ఏడాది ఆరంభంలో అరెస్టు చేసింది. తల్వార్ విచారణ ద్వారా తెలిసిన విషయాల్ని ప్రఫుల్ పటేల్ ముందు ఉంచి, వాస్తవం రాబట్టాలని భావిస్తున్నట్లు ఈడీ తెలిపింది.
విచారణకు సహకరిస్తా...
ఈడీ సమన్లపై స్పందించారు ప్రఫుల్ పటేల్. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. విమానయాన రంగంలోని సంక్షిష్టతలను అధికారులు అర్థం చేసుకునేందుకు విచారణకు హాజరవుతానని ప్రకటించారు.
ఇదీ చూడండి : నితీశ్‌ను ఒప్పించలేకపోయిన 'షా'...