ఎన్నికల్లో పోటీచేసే నేర చరితులు ఇక మీదట తమ నేర చరిత్రను పోలింగ్ తేదీకి ముందే మూడుసార్లు ప్రసారమాధ్యమ ప్రకటనల ద్వారా వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పేర్కొంది. శుక్రవారం జరిగిన కమిషన్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు, వారిని బరిలో దింపిన రాజకీయ పార్టీలు ఈ ప్రకటనలు చేయాలని తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం పత్రికలు, టీవీల్లో ప్రకటనలివ్వాల్సిన షెడ్యూల్..
- తొలి ప్రకటన: నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత తొలి నాలుగు రోజుల్లో పత్రికలు, టీవీల ద్వారా ప్రకటన ఇవ్వాలి.
- రెండో ప్రకటన: నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత 5 నుంచి 8 రోజుల మధ్యలో ప్రసార మాధ్యమాల ద్వారా ప్రకటించాలి.
- మూడో ప్రకటన: తుది ప్రకటన నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత తొమ్మిదో రోజు నుంచి ప్రచారం ముగిసే చివరి రోజు (పోలింగ్‌కు రెండు రోజుల ముందు) వరకు ఇవ్వాలి.
అభ్యర్థుల నేర చరిత్రలు తెలుసుకుని ఓటు ఎవరికి వేయాలనేది ఓటర్లు నిర్ణయించుకోవటంలో ఈ ఆదేశాలు ఉపయోగపడతాయని ఎన్నికల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు, వారిని బరిలో దింపిన రాజకీయ పార్టీలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది ఈసీ.
ఇదీ చూడండి: రాజకీయం.. నేరమయం- సుప్రీం తీర్పు ఆశాకిరణం