ముసాయిదా జాతీయ విద్యా విధానం, మాతృభాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయితే బహుభాషా ప్రపంచంలో ఇతర భాషా నైపుణ్యాలు కలిగి ఉండడం అవసరమని ఆయన స్పష్టం చేశారు.
"విద్యా వ్యవస్థలో మూడు ఆర్లు ముఖ్యం.'రీథింక్(పునరాలోచన), రీ ఇమాజిన్(మరలా ఊహించుట), రీ ఇన్వెంట్(కొత్తగా ఆవిష్కరించుట) అవసరముంది."
"భారతదేశంలో ఇప్పుడు ప్రధాన సంస్కరణ విధానాన్ని అనుసరిస్తున్నాం. కొన్ని రోజుల క్రితం బహిరంగ చర్చ కోసం విడుదల చేసిన జాతీయ విద్యా విధాన ముసాయిదాను మీరు చదివి ఉంటారు. ఈ పత్రంలో యువతకు, చిన్నారులకు నాణ్యమైన విద్య అందించే అంశాలు సవివరంగా ఉన్నాయి."
-వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి
ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యనందించడం ద్వారా దేశ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను తీర్చిదిద్ది, వారి భవితవ్యానికి చక్కని బాటలు వేసేలా ప్రస్తుత ముసాయిదా విద్యా విధానం రూపొందించారని వెంకయ్య తెలిపారు. వ్యవహార భాషైన మాతృభాషతో పాటు ఇతర భాషా నైపుణ్యాలు కూడా అవసరమని ఆయన అన్నారు.
ఇదీ వివాదం..
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నూతన జాతీయ విద్యావిధానాన్ని రూపొందించింది. అందులో త్రిభాషా సూత్రం ఆధారంగా అన్ని రాష్ట్రాలు హిందీని పాఠశాలల్లో బోధించాలని తెలిపింది.
ఈ చర్య తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దడమేనని, హిందీయేత రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే హిందీ భాషా బోధన రాష్ట్రాల ఐచ్ఛికానికే వదిలేసినట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ చెబుతోంది.
ఇదీ చూడండి: 'మంత్రివర్గ విస్తరణే కూటమి పతనానికి నాంది'