మహారాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న విషయంపై.. రాముడిని నమ్మే భాజపా నిజం చెప్పాలన్న శివసేన నేత సంజయ్ రౌత్...మరో బాంబు పేల్చారు. మేం మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించేలా చెయ్యొద్దంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎవరూ పునీతులు కాదని తెలిపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 105 స్థానాల్లో విజయం సాధించగా.. 56 సీట్లలో శివసేన జెండా ఎగరేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒకరిపై మరొకరు ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపాతో కలసి నడవడానికి శివసేన సుముఖంగా లేదని.. మరో సానుకూల ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తోందని.. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి నేతలు అనధికారికంగా వ్యాఖ్యానిస్తున్నారు.
"మేం భాజపాతో పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మాకు సంకీర్ణ కూటమిపై నమ్మకం ఉంది. కానీ మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి తప్పు చేసేందుకు భాజపా మమ్మల్ని ప్రేరేపించకూడదు."
-సంజయ్ రౌత్, శివసేన నేత.
ఇరు పార్టీలు అధికారాన్ని పంచుకునే విషయంపై గతంలోనే చర్చ జరిగిందని సంజయ్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు శివసేనను భాజపా ఎక్కువ సీట్లు కోరిందని.. అందుకు ఉద్ధవ్ ఠాక్రే అంగీకరించారని తెలిపారు. అందుకే భాజపా 164 సీట్లలో పోటీ చేయగా.. సేన 124 సీట్లలో బరిలో నిలిచాయని వెల్లడించారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా ముందడుగు వేస్తుందా అన్న అంశంపై రౌత్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ భాజపా అని.. సేన సహకారం లేకుండా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే దానిని తాము ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పీఠాన్ని ఎందుకు పంచుకోరో మేమూ చూస్తామని వ్యాఖ్యానించారు రౌత్. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదిశగా భాజపా-శివసేనల మధ్య చర్చ జరగలేదన్నారు. సంజయ్ రౌత్ ప్రస్తుతం పార్లమెంట్లో పార్టీ విప్‌గా ఉన్నారు. శివసేన పత్రిక సామ్నాకు కార్యనిర్వాహక సంపాదకుడి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.