కర్ణాటక డీజే హళ్లి, కేజీ హళ్లిలో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విస్తృత సోదాలు చేపట్టింది. ఏకకాలంలో బెంగళూరులోని 12 చోట్ల తనిఖీలు చేసింది.
సిలికాన్ సిటీ పోలీస్ నుంచి కేసు బాధ్యతను తీసుకున్న ఎన్ఐఏ.. 2 రోజుల కిందట నిందితులపై రెండు కేసులు నమోదు చేసింది. కేజీ హళ్లిలో నమోదు చేసిన కేసు ఆధారంగా.. ఎన్ఐఏ డీఐజీ, ఐజీ, ఎస్పీ ఆధ్వర్యంలోని బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది.
అల్లర్లకు ప్రధాన కారణమైన ఐఎస్డీ నాయకులు, కార్యకర్తలకు ఉగ్రవాదులతో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కీలక వివరాలు సేకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ మొత్తం 12 ప్రదేశాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ. నిందితుల ఇళ్లు, కార్యాలయాల నుంచి పలు దస్త్రాలను స్వాధీనం చేసుకుంది.
ఈ కేసులో మాజీ మేయర్ సంపత్ రాజ్ సహా బెంగళూరులోని ఇతర కార్పొరేటర్ల వాంగ్మూలాలు సేకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదీ కేసు..
ఆగస్టు 11న రాత్రి 8 గంటల సమయంలో వెయ్యి మంది దుండగులు కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ శ్రీనివాస్ మూర్తి ఇంటి ముందు హింసాత్మక ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మేనల్లుడు ఫేస్బుక్లో అనుచిత పోస్టు చేసినందుకు నవీన్ ఇంటి ముందు విధ్వంసానికి పాల్పడ్డారు. తమ మనోభావాలు కించపరిచేలా పోస్టు ఉందని ఆరోపించారు. అనంతరం డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీసు స్టేషన్లపై దాడి చేశారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పంటించారు.
అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 300 మందికిపైగా అరెస్టు చేశారు. ఇందులో ఎక్కువగా ఎస్డీపీఐ సభ్యులే ఉన్నారు.