భారతీయతలోనే ఓ వెలుగు ఉంది. ‘భా’ అంటే కాంతి అనీ, ‘రతం’ అంటే ఆనందం అనీ అర్థముంది. వెలుగును ఇష్టపడేవారు కనుక మనకు ‘భారతీయులు’ అనే పేరు వచ్చిందని వ్యాఖ్యానిస్తారు. అటువంటి దీపాన్ని ఆరాధిస్తూ చేసుకునే పండగ దీపావళి. ఆసేతు హిమాచలం చేసుకునే దివ్యమైన పండగ ఇది. భారతీయ సంప్రదాయంలో దీపం దైవ స్వరూపం. జ్ఞానానికి చిహ్నం. ఐశ్వర్యానికి సంకేతం. సంపద, ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజ చేయడమే దీపావళి అంతరార్థం.
నరకాసుర వధ కథ
దీపావళి నేపథ్యంలో వినిపించే కథ నరకాసుర వధ. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు, భూదేవిల బిడ్డ అయినా, మహావీరుడైనా అహం తలకెక్కితే జరిగే అనర్థానికి నరకుడు ఓ నిదర్శనం. చెడు స్నేహంతో తనకుతాను చావును కొని తెచ్చుకున్న తీరు ప్రతి ఒక్కరికీ మేలుకొలుపు. దారితప్పితే కొడుకునైనా తల్లి క్షమించదని సత్యభామ నిరూపించింది. రాగద్వేషాలకు అతీతంగా ధర్మాన్ని కాపాడి ఆదర్శ దంపతులుగా శ్రీకృష్ణుడు, సత్యభామ నిలిచిపోయారు. వ్యాస విరచిత ‘హరివంశం’లో ఉందీ గాథ.
దీపావళి పండగలో అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నుంచే దీపం పెట్టడం ప్రారంభమవుతుంది. ఆనాటి రాత్రి యమదీపం పెడతారు. ఇది పండగకు ఇంటికి వచ్చే పితృదేవతలకు మార్గం చూపుతుందని నమ్మకం ఉంది. ఇంట్లోని ప్రతి గదిలో దీపం పెడతారు. యమదీపాన్ని తల్లిదండ్రులు గతించిన వారు మాత్రమే పెడుతుంటారు.
నరక చతుర్దశి నాడు తప్పనిసరిగా తలస్నానం చేయాలంటారు. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగా దేవి కొలువై ఉంటారని చెబుతారు. అందువల్ల తలస్నానం చేసినవారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్మకం.
అభ్యంగన స్నానానికి ముందు అన్నదమ్ములకు.. అక్కచెల్లెళ్ళు తలపై నువ్వులనూనె అంటి, నుదుట కుంకుమబొట్టు పెట్టి మంగళహారతి ఇస్తారు. తోబుట్టువులకు బహుమతి అందజేస్తారు అన్నాదమ్ముళ్లు. సోదరీ సోదరులు అనుబంధం పదికాలాలపాటు పచ్చగా ఉండాలన్నది ఈ వేడుకలోని ఆంతర్యం. ఆ అనుబంధానికి దూరం కావటమే నరకమని, అదే దుర్గతి అని, ఆ నరకబాధ లేకుండా ఉండటమే నరకచతుర్దశి అని ఈ వేడుక సూచిస్తుంది.
తెలతెలవారుతోంది...
గంగానదీ తీరం ఎంతో ఆహ్లాదంగా ఉంది.
దూరంగా ఉన్న మిథిలా నగరంలో సందడి మొదలైంది.
నది ఒడ్డునున్న యజ్ఞ వాటిక వేద నాదంతో ప్రతిధ్వనిస్తోంది.
ఓ పంటపొలాన్ని తన బంగారు నాగలితో దున్నడానికి సిద్ధమవుతున్నాడు జనక మహారాజు.
మంత్ర శబ్దాలు మిన్నంటుతుండగా నాగలిని నేలకు తాటించి ముందుకు నడిపాడు జనకుడు.
అలా కొద్దిదూరం సాగగానే ఖంగ్ మంటూ శబ్దం.
చూస్తే బంగారంతో తాపడం చేసిన ఓ పేటిక. తెరిచి చూస్తే ఓ ముద్దులొలికే బిడ్డ...
ఇది సీత కథ కాదు...
అప్పటికి సీతావతరణం జరిగి చాలా కాలమైంది.
రావణ వధ కూడా పూర్తయింది.
ఇప్పుడు కనిపించిన ఆ పసివాడిపేరు నరకుడు.
సీత దొరికిన చోటే భూమిలో ఈ బాలుడు కూడా ఉద్భవించాడు.
అప్పుడు జరిగిందో విచిత్రం...
దిక్కులు మార్మోగే శబ్దంతో భూదేవి అక్కడ ప్రత్యక్షమైంది.
అమె అక్కడందరికీ ఆ బాలుడి గురించి చెప్పడం ప్రారంభించింది.
'హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాచాడు. అప్పుడు శ్రీహరి వరాహ రూపాన్ని ధరించి రాక్షసుడిని సంహరించి భూదేవిని యథాస్థానంలో ఉంచాడు. ఈ సమయంలో భూదేవి, విష్ణువు కారణంగా గర్భందాల్చింది. ఎంతకాలానికీ ప్రసవం జరగకపోవడంతో భూదేవి బాధ పడసాగింది. అప్పుడు విష్ణుమూర్తి ఆమెను ఓదారుస్తూ నీ గర్భాన పుట్టబోయేవాడు మహాబలవంతుడు, పరాక్రమశాలి. తన బలంతో లోకాలను జయిస్తాడు. ఈ విషయం తెలిసి బ్రహ్మాది దేవతలు ప్రసవం జరగకుండా బాధ పెడుతున్నారు. త్రేతాయుగంలో నేను రావణ వధ కోసం రాముడి పేరుతో అవతరిస్తాను. రావణ వధ తర్వాత నీకు ప్రసవం జరుగుతుందని చెప్పాడు ఆ ప్రకారమే ఈ బిడ్డ జననం జరిగింది. ఈ పిల్లాడిని పదహారేళ్ల వరకు పెంచమని' జనక మహారాజును కోరింది.
అలా జనకాశ్రయానికి చేరిన నరకుడు రాజోచిత విద్యలన్నిటిలో ఆరితేరాడు. సరిగ్గా పదహారేళ్ల తర్వాత భూదేవి అతణ్ణి గంగాతీరానికి తీసుకెళ్లింది. అక్కడ మహావిష్ణు సమేతంగా కనిపించి, ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని, శక్తి అనే విశేష ఆయుధాన్ని, ఒక దివ్య రథాన్ని అనుగ్రహించింది. తర్వాత నరకుడు విదర్భరాజ కుమార్తె మాయాదేవిని పెళ్లాడాడు. రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నాడు. తనను పెంచిన జనకుణ్ణి కూడా ఎంతో ఆదరించి, గౌరవించేవాడు.
ఇలా చాలాకాలం గడిచిన తర్వాత...
బాణాసురుడనే వాడితో స్నేహం కుదిరింది. ఈ బాణాసురుడు కామరూప రాజ్యానికి పొరుగున ఉన్న శోణిత పురానికి అధిపతి. అసుర లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నవాడు. స్త్రీలంటే గౌరవం లేదు. వాళ్లు ఆటబొమ్మలని బలంగా నమ్ముతాడు. అసూయ ద్వేషాలకు చిరునామా ఇతడు. ఆరునెలల స్నేహంతో వారు వీరవుతారన్నట్లు బాణాసురుడి లక్షణాలన్నీ నరకుడు కొనితెచ్చుకున్నాడు. బలగర్వంతో అన్ని దుర్మార్గాలకూ ఒడిగట్టాడు. వసిష్ఠుడు లాంటి మహర్షులను బాధించి వారి శాపాలకు గురయ్యాడు. బ్రహ్మ వరాలను పొంది, మిడిసిపాటుతో యుద్ధాలకు దిగాడు. పాపం, పుణ్యం తెలియని పదహారువేల మంది రాకుమార్తెలను తెచ్చి బంధించాడు. దేవమాత దితి చెవులకుండే కుండలాలు అమృతాన్ని స్రవిస్తుంటాయని తెలిసి వాటిని లాక్కున్నాడు. వరుణ దేవుడి ఛత్రాన్ని, ఇంద్రుడి మణి పర్వతాన్ని కూడా బలవంతంగా తీసుకున్నాడు.
ఇక ప్రకృతి తన పని తాను చేసుకుపోయింది. భూమిపై పాప భారం పెరిగిపోయింది. సాక్షాత్తు తల్లే బిడ్డ దుర్మార్గాలను ఖండించే బాధ్యతను తీసుకుంది. సత్యభామగా మారి శ్రీకృష్ణుడి సహకారంతో రాక్షస వధ చేసింది.
-రచయిత: యల్లాప్రగడ మల్లికార్జునరావు.